- ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ మారేడ్ పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ ఆర్థోడాక్స్ చర్చి 75 ఏండ్ల వేడుకలను జరుపుకుంటోంది. ధ్వజ స్తంభం (ఫ్లాగ్పోల్) ఉన్న చర్చిగా పేరుగాంచిన ఈ చర్చిలో ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చి ముందున్న ఫ్లాగ్పోల్ వద్ద ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బిషప్ అలెక్సియో, ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రియాంక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి రోజు ఒక్కో ప్రత్యేక కార్యక్రమంతో ఈ ఏడాది పొడవునా ప్లాటినం జూబ్లీ వేడుకలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, యువజన క్రీడలు, మ్యూజిక్ -కల్చరల్ నైట్స్ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిమన్నారు. ఈ వేడుకలతో భక్తుల అనుబంధం మరింత బలపడుతుందని, వేలాది మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు.
ఇదీ చరిత్ర..
సిరియన్ క్రైస్తవ సంప్రదాయాలతో 1865లో బ్రిటిష్ సైనికుల కోసం స్కాటిష్ చర్చిగా దీనిని నిర్మించారు. స్వాతంత్ర్యం తర్వాత ఈ భవనం భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత సిరియన్ క్రైస్తవ సమాజానికి అప్పగించారు.
1948లో మలయాళ క్రైస్తవ సంఘం స్వాధీనం చేసుకుంది. 1956లో సెయింట్ ఆండ్రూస్ ఆర్థోడాక్స్ పారిష్ స్థాపనతో ఇక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాలు వేగంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో పెరిగే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2002లో పాత భవనాన్ని కూల్చి 2005లో కొత్తది నిర్మించారు. ఇలా దశాబ్దాలుగా విశ్వాస కేంద్రంగా నిలిచిన ఈ చర్చికి క్రైస్తవుల ఆదరణ విస్తృతంగా ఉంది.
