‘నాడు ఉరిశిక్ష పడింది. ఆ తర్వాత అది జీవిత ఖైదుగా మారింది. నా మంచి ప్రవర్తన వల్ల రెమిషన్ లభించింది. జైలు నుంచి విడుదలై కూడా చాలా సంవత్సరాలు అయ్యింది. నా ఆత్మకథని హిందీలో రాశాను. అది తెలుగులోకి అనువాదం అవుతుంది. ఎమెస్కో వాళ్లు దాన్ని ప్రచురించవచ్చు’ ఇవన్నీ నాకు టెలిఫోన్‌లో ఒక అపరిచితుడు చెప్పిన విషయాలు. నాకెందుకు చెప్తున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. అతని పేరు రాజన్న. ఇది దాదాపు సంవత్సరం క్రితం జరిగిన సంభాషణ. అతను చెప్పిన విషయాలు జాగ్రత్తగా విన్నాను.
గత ఆగస్టు నెలలో ఆత్మీయుడు, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ ఫోన్ చేసి ఉరిశిక్ష నుంచి బయటపడిన బహుజనుడి గురించి చెప్పి అతని పుస్తకాన్ని ఎమెస్కో వాళ్లు ప్రచురించారని, దాని పేరు ‘‘ఉరికంబం నీడలో ఒక బహుజనుడి ఆత్మకథ” అని ఆ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలని ఆ రచయిత కోరుకుంటున్నాడని చెప్పారు. సరేనని చెప్పాను. ఆ తర్వాత రాజన్నతో కలిసి నిఖిలేశ్వర్ మా ఇంటికి వచ్చి ఆ పుస్తకాన్ని, ఆహ్వాన పత్రికను ఇచ్చారు. వరంగల్ వెళ్తూ.. ఆ పుస్తకాన్ని ఏక బిగిన చదివి, అక్కడి సెషన్స్ జడ్జి పట్టాభికి చదవమని ఇచ్చాను. మిగతా న్యాయమూర్తులను కూడా చదవమని చెప్పాను.
దీన్ని రాజన్న ఆత్మకథ, నవల అనొచ్చు. ఏదన్నా పర్లేదు. మనల్ని చదివిస్తుంది. 1980 ప్రాంతంలోని పరిస్థితులు అవగతం అవుతాయి. జైలు ఎలా ఉంటుంది? పోలీసులు ఎలా ఉంటారు? కోర్టులు ఎలా పనిచేస్తాయి? అన్న విషయాలతోపాటు అప్పటి సమాజం, అదిలాబాద్, మహారాష్ట్ర పరిసరాల జీవితం కనిపిస్తుంది. రజకుల జీవితం, వారి జీవన విధానం.. బట్టలు ఉతికిన ఇండ్లకు వెళ్లి అన్నం తీసుకెళ్లే స్థితిగతులు అన్నీ కనిపిస్తాయి.
రాజన్న సాధారణమైన వ్యక్తి. పేదరికంలో పెరిగాడు. తెలంగాణలోని ఇతర గ్రామాల మాదిరిగానే వాళ్ల గ్రామంలోనూ భూస్వాముల అణచివేత, జులుం ఉండేవి. దళిత బహుజనులు ఎవరూ జమీందార్ల ఇంటి ముందటి నుంచి వెళ్లలేకపోయేవారు. అది నిషిద్ధం. మానభంగాలు సహజం. కొత్తగా పెండ్లైన ఓ అమ్మాయిని ఆ ఊరి దొర లాక్కెళ్లి మానభంగం చేస్తాడు. అలాంటి సంఘటనలు చూసి రాజన్న రక్తం మరిగిపోయేది. ఆ దొర రాజన్న భార్య లత మీద కన్నేస్తాడు. దోబీఘాట్‌కి బట్టలు ఉతకడానికి ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు దొర. అది ఘర్షణకు దారితీస్తుంది.
రాజన్న ఎదురుతిరగడాన్ని ఆ పెత్తందారి భరించలేడు. రాజన్న ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో దొర ప్రాణాలు పోయాయి. ఇద్దరూ కలిసి వాళ్ల ఊరు కారింజి నుంచి వాళ్ల చిన్నమ్మ దగ్గరికి కేలాపూర్‌కి వెళ్లారు. ఆ తర్వాత ఆలోచించి పారిపోవడం సరైంది కాదని ఆదిలాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఆ తర్వాత అతన్ని బేలా పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్తారు. జరిగింది ఒకటైతే కేసు మరో రకంగా తయారవుతుంది. దాంతో రాజన్నకి పోలీసులన్నా కోర్టులన్నా ఒక రకమైన తిరస్కార భావం ఏర్పడుతుంది. తప్పుడు సాక్ష్యాలతో కేసు అబద్ధంగా తయారు కావడం వల్ల రాజన్నకి నేర న్యాయవ్యవస్థల మీద నమ్మకం పోయింది.
విచారణలో తీవ్రవైన నిరసనతో జడ్జి మీదకు చెప్పు విసురుతాడు. తీర్పు చెప్పే రోజు కూడా తన నిరసనని వ్యక్తపరుస్తాడు. బూటకపు కోర్టులో ఏం శిక్ష విధిస్తారో విధించుకోండి అంటాడు. రాజన్న చేసింది హత్య.. అది ఆత్మ రక్షణ కోసం చేసింది. కేసు మరో విధంగా తయారైంది. తప్పుడు సాక్ష్యాలు ఉన్నా అది మరణ శిక్ష విధించాల్సిన కేసు కాదు. జీవిత ఖైదు విధించాల్సిన కేసు. న్యాయమూర్తి పూర్వ భావనల వల్ల శిక్షని విధించినట్టుగా నాకు అనిపించింది. అందుకే న్యాయమూర్తులు చదవాల్సిన ఆత్మకథ ఇది.
రాజన్న కథ ఒక సామాన్యుడి వ్యథ. రాజన్న జైలులో తన జీవితాన్ని నిరర్థకంగా గడపలేదు. చదువుకున్నాడు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. రాజన్న జీవితం ఎందరికో ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. తమ జీవితాలను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో తెలియచెప్తుంది. జైలులోనే తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నాడు. ఓపెన్ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశాడు. హిందీ కోర్సులు, జర్నలిజం పూర్తి చేశాడు.
పెరోల్ మీద రాజన్న జైలు నుంచి బయటికి వస్తాడు. చెల్లి శోభని కలవడానికి కేలాపూర్ వెళ్తాడు. అతన్ని కలవడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతను లత రెండో భర్త. అప్పుడు రాజన్న కలవలేకపోతాడు. మరుసటి రోజు అతను పనిచేస్తున్న చోటికి రాజన్న, శోభ వాళ్ల మామ వెళ్తారు. అతను రాజన్నని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. ‘నువ్వు ఎప్పుడైతే ఆమెకు మరో పెండ్లి చేసుకోమని అనుమతి ఇచ్చావో అప్పుడే ఆమెని మర్చిపోవాలి’ అని జైల్లో కామ్రేడ్ లక్ష్మీకాంతం అన్న మాటలు గుర్తుకొస్తాయి.
రాజన్న వాళ్ల ఇంటికి వెళ్తాడు. లత రెండో భర్త ఎంతో మంచివాడు. అతని ఉన్నతమైన వ్యక్తిత్వం చూసి చలించిపోతాడు. అక్కడే భోజనం చేస్తాడు. గతమంతా వివరిస్తాడు. ఆ వాతావరణంలో లత, అతను భావోద్వేగానికి గురవుతారు. ఒకరి భుజం మీద ఒకరు తల వాల్చి, ఏడ్చి దుఃఖభారాన్ని దించుకునే వీలులేదు. ఆమె మరొకరి భార్య. తాను పరాయివాడు. అక్కడికి వచ్చి తప్పు చేశానా అని వ్యథ చెందుతాడు. తిరిగి వెళ్లేటప్పుడు వారి వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అంటాడు. ఇక్కడ ఇద్దరూ ఉన్నతమైన మానవులుగా కనిపిస్తారు.
జైలు నుంచి విడుదలయ్యాక ‘హైదరాబాద్ సమాచార్’ పత్రిక సంపాదకులు శ్రీ మునీంద్ర, ఆర్య సమాజ్ నాయకుడు పండిట్ గంగారామ్‌లు అతనికి అన్ని విధాలా సహకరిస్తారు. మునీంద్ర గారు తన పత్రికలో ఉపాధి కల్పించి, ఆదరిస్తారు. ఆ తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆర్.వి. చంద్రశేఖర్ రావు తోడ్పాటుతో అక్కడ తాత్కాలిక ఉద్యోగిగా చేరాడు.
రాజన్న తండ్రి నానాజీ. అమ్మ గంగూబాయి. రాజన్నకి నాలుగేండ్ల వయసున్నప్పుడు ఆమెని ఇంట్లోనుంచి వెళ్లగొడతాడు. ఆమె మరణం తర్వాత మహారాష్ట్రలోని వాళ్ల చిన్నమ్మ ఇంటికి వెళ్తాడు. అక్కడ లియాకత్ అలీ సాయం చేస్తాడు. జైలులో జైలర్ మోజెస్ హైకోర్టుకి దరఖాస్తు చేసుకోమని చెప్తాడు. బతుకుమీద రాజన్నకి ఆశ కల్పిస్తాడు. ఫిలిప్ అనే జైలు అధికారి కూడా సాయం చేస్తాడు. జైలు బయట ఉన్నప్పుడు బతుకుని ఇచ్చింది ముస్లింలు. జైలులో బతుకు మీద ఆశ కల్పించింది క్రిస్టియన్లు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత జీవితాన్ని ఇచ్చింది హిందువులు. ఇదీ రాజన్న జీవితంలోని వైచిత్రి.
బాల్యంలోనే అన్నీ కోల్పోయినప్పుడు రాజన్న ఒంటరివాడు. ఉరిశిక్ష పడిన తర్వాత బ్యారక్‌లో ఒంటరివాడు. యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పుడు ఒంటరే. కానీ.. నిఖిలేశ్వర్ అన్నట్టు ఇప్పుడు రాజన్న ఒంటరివాడు కాదు. అన్ని విధాలా సహకరించే భార్య, ఎదిగి వచ్చిన కొడుకు, కూతురు. తెలంగాణ సమాచార్ పేరిట హిందీ, తెలుగులో ఆన్‌లైన్ సమాచారాన్ని అందిస్తూ క్రియాశీలకంగా ఉన్నాడు.
సులభ శైలిలో అనువాదం చేసిన కారం శంకర్‌ని, ప్రచురించిన ఎమెస్కో విజయ్ కుమార్, సంపాదకులు చంద్రశేఖర్ రెడ్డి గార్లని అభినందించకుండా ఉండలేను. రాజన్నని, రాజన్న పుస్తకాన్ని పరిచయం చేసిన నిఖిలేశ్వర్ గారికి కృతజ్ఞతలు.
శిక్ష వేసింది న్యాయమూర్తి, ఉరికంబం నీడలో పుస్తకాన్ని ఆవిష్కరించింది న్యాయమూర్తే కావడం విశేషం. న్యాయ వ్యవస్థపైన అపారమైన నమ్మకం ఏర్పడ్డ రాజన్న నన్ను ఆవిష్కరణకు ఎంపిక చేసుకోవడంలో ఆశ్యర్యం లేదు. శిక్ష వేసిన తర్వాత న్యాయమూర్తి ఎలా ఉంటాడు...
నిజానిజాల మధ్య అటూ ఇటూ ఊగిసలాడిన నాడు న్యాయన్యాయాల విసుర్రాయి వరలో చిక్కిననాడు సమాజం– శాంతి భద్రతలు, నేరం దాని ప్రభావం నేను అన్వయించుకున్న చట్టం నిన్ను దోషిని చేశాయి. ... నిజానిజాల మధ్య ఒరిగిపోయి కరిగిపోయిన నేను నా ధర్మాన్ని నిర్వర్తించానని అనుకుంటాను. నీ రూపు మర్చిపోయే ప్రయత్నంలో మరో శిక్ష విధిస్తాను.
పది సంవత్సరాల జైలు జీవితం తర్వాత 1990 జనవరి 26న ఆనాటి ప్రభుత్వం రెమిషన్‌ని ప్రకటించి రాజన్నని విడుదల చేసింది. పదేండ్ల కారాగారంలో ఎంతో కోల్పోయాడు. భార్య లతను కోల్పోయాడు. మరెంతో కూడా పొందాడు. జైలులో ఉన్నప్పుడు రాజన్నకి వాళ్ల మామ దగ్గర్నించి ఉత్తరం వస్తుంది. అందులో ‘‘బిడ్డా ఆడపిల్ల కదా.. ఎంతకాలం ఒంటరిగా ఉంటుంది. దాని ముందు ఎంతో భవిష్యత్తు ఉంది” అని ఉంది. ఆ ఉత్తరంలో అంతరార్థం అర్థం చేసుకుని ఆమెకు మళ్లీ వివాహం చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని రాస్తాడు. ఆమెకు మళ్లీ పెండ్లి చేస్తారు.
- డా. మంగారి రాజేందర్, కవి, రచయిత-
