- త్వరలోనే ప్రారంభించేందుకు ఆఫీసర్ల కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాలేజీలు, స్టూడెంట్ల సమగ్ర సమాచారం ఇకపై చిటికెలో దొరకనుంది. దీనికోసం తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక ప్రత్యేకమైన ‘డ్యాష్ బోర్డు’ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటిదాకా ఏదైనా సమాచారం కావాలంటే ఫైళ్లు వెతకడమో, లేదంటే కాలేజీల నుంచి రిపోర్టులు తెప్పించుకోవడమో చేయాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త డ్యాష్బోర్డుతో ఆ తిప్పలు తప్పనున్నాయి.
రాష్ట్రంలో ఎన్ని కాలేజీలున్నాయి.. ఏ కాలేజీలో ఎన్ని సీట్లున్నాయి? ఇప్పటిదాకా ఎన్ని అడ్మిషన్లు అయ్యాయి? అనే వివరాలన్నీ ఈ డ్యాష్ బోర్డులో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయి. కేవలం అడ్మిషన్లే కాకుండా.. ఏ వర్సిటీ పరిధిలో ఎంతమంది స్టూడెంట్లు ఉన్నారు, ఏ జిల్లాలో ఏ కోర్సులకు డిమాండ్ ఉందనే డేటా కూడా ఇందులో ఎంట్రీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్.. ఇలా అన్ని కోర్సుల డేటాను జిల్లాలు, వర్సిటీలు, కేటగిరీల వారీగా చూసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.
ఈ డ్యాష్ బోర్డును త్వరలోనే ప్రారంభించేందుకు కౌన్సిల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డ్యాష్ బోర్డును త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. విద్యాశాఖలో పారదర్శకత పెరగడంతో పాటు, పాలసీలు రూపొందించడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడనుందని వారు చెప్పారు.
