- ‘డ్రాఫ్ట్’లో పేర్లు లేని వారు, ఫస్ట్ టైమ్ ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలి
- తప్పుడు వివరాలతో ‘ఫామ్-7’కు దరఖాస్తు చేస్తే క్రిమినల్ కేసులు
- గల్లంతైన పేర్ల రీ-వెరిఫికేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి
- గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ‘ఎపిక్’ తప్పనిసరి కాదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్లలో స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, అర్హత కలిగిన యువతీ యువకులు నిర్దేశిత కేంద్రాలకు వెళ్లి ఫామ్- 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ క్యాంపుల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ డీఈవోతో పాటు రాష్ట్రంలోని కలెక్టర్లు, డీఈవోలు, ఈఆర్వోలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి, అర్హత కలిగిన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు చేపట్టాలని సీఈవో స్పష్టం చేశారు.
గల్లంతైన ఓటర్ల కోసం ఇంటింటి రీవెరిఫికేషన్
సర్ ప్రక్రియ అనంతరం ఓటర్ల జాబితా నుంచి గల్లంతైన పేర్ల రీ-వెరిఫికేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఈవో యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సర్ కంటే ముందు, ఆ తర్వాత ఉన్న జాబితాలను బీఎల్వోలు సరిపోల్చి చూసి, తొలగించిన ఓటర్ల (ఏఎస్డీడీ: అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్) లిస్ట్ను సిద్ధం చేయాలన్నారు. ఈ జాబితా ఆధారంగా బీఎల్వోలు నేరుగా ఇంటింటికీ వెళ్లి అర్హత ఉన్నవారిని గుర్తించి, వారితో ఫామ్- 6 దరఖాస్తులు నింపించాలని ఆదేశించారు.
బీఎల్వోలు వారానికి కనీసం 20 నుంచి 25 మంది ఓటర్లను పరిశీలిస్తూ నెల రోజుల్లో ఈ రీ-వెరిఫికేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు నిరాశ్రయులు, నైట్ షెల్టర్లలో ఉండే వాళ్లు, లేబర్ కాలనీల్లోని కార్మికుల కోసం ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటరు కార్డులు అందించాలన్నారు. విద్యాసంస్థల్లో ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో రోజుకు 200 పోస్టుల లక్ష్యంతో ప్రచార ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.
ఫామ్-7 దరఖాస్తులపై ఈసీ పరిమితులు
ఇతరుల ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా ఫామ్-7 దరఖాస్తులు సమర్పిస్తుండడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇలాంటి తొలగింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఒక్కో ఓటరు చేసే ఫామ్-7 అభ్యంతరాలపై ఈసీ పరిమితులు విధించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల వ్యవధి మొత్తంలో ఒక వ్యక్తి గరిష్టంగా 10 మాత్రమే ఫామ్-7 దరఖాస్తులు సమర్పించేందుకు అనుమతి ఉంటుందని, నిరంతర సవరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులకే పరిమితం చేయాలని ఆదేశించింది.
రాజకీయ పార్టీల బీఎల్ఏలు డ్రాఫ్ట్ పబ్లికేషన్కు ముందు రోజుకు గరిష్టంగా 50, ఆ తర్వాత రోజుకు 10 కంటే ఎక్కువ ఇవ్వరాదన్నారు. ఒకే వ్యక్తి ఐదు కంటే ఎక్కువ అభ్యంతరాలు తెలిపితే ఈఆర్వో స్వయంగా క్రాస్ వెరిఫికేషన్ చేసి, విచారణ జరపాలని ఆదేశించారు. ఒరిజినల్ సంతకం లేకున్నా, స్టాంపులు వేసినా ఆ దరఖాస్తులు చెల్లవని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలతో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు
పంపుతామని హెచ్చరించారు.
గ్రాడ్యుయేట్ ఫామ్-18ను ఈజీగా తిరస్కరించొద్దు
మహబూబ్నగర్-– రంగారెడ్డి– హైదరాబాద్, వరంగల్– ఖమ్మం– నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీపై సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. 2026 నవంబర్ 1 అర్హత తేదీగా ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ సాగుతున్నదని పేర్కొన్నారు. కాగా గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఫామ్-18 సమర్పించే సమయంలో అధికారులు ఎపిక్ (సాధారణ ఓటరు గుర్తింపు కార్డు) నంబరు, వివరాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పట్టభద్రుల ఓటరు నమోదుకు ఎపిక్ నంబరు ఇవ్వడం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఎపిక్ కార్డు వివరాలు లేవన్న ఏకైక కారణంతో ఫామ్-18 దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని డీఈవోలు, ఈఆర్వోలకు తేల్చిచెప్పారు.
