
హైదరాబాద్: వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష సూచన చేసింది. ఈ రోజు(సెప్టెంబర్ 16), రేపు (సెప్టెంబర్ 17) పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణకు ఆనుకొని తూర్పు విదర్భ ప్రాంతంలో మరో ఉపరితల అవర్తనం కొనసాగుతున్న కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది.
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, ఇంటెన్స్ స్పెల్ కారణంగా సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ జోరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు (సెప్టెంబర్ 17) వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది.
హైదరాబాద్ సిటీలో వాతావరణం ఎలా ఉందంటే.. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎండలు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వానలు కురుస్తున్న పరిస్థితి ఉంది. సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.