రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాన గట్టిగనే చెప్పిర్రు..!

రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాన గట్టిగనే చెప్పిర్రు..!
  • బుధ, గురువారాల్లో కురిసే చాన్స్​
  • ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

హైదరాబాద్​, వెలుగు: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్​నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఐఎండీ  ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ  తెలిపింది.  చెట్ల కింద ఎవరూ ఉండొద్దని సూచించింది. కాగా,  బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెండు ద్రోణుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లగా మారింది. ఎండల తీవ్రత తగ్గిపోయి.. ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్​ సహా చాలా జిల్లాల్లో ఆకాశం మబ్బుపట్టి కనిపించింది.