రెండ్రోజులు భారీ వర్షాలు..సెప్టెంబర్ 21, 22న ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

రెండ్రోజులు భారీ వర్షాలు..సెప్టెంబర్ 21, 22న ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  • 22 నుంచి 25 వరకు ఆరెంజ్ అలర్ట్​
  • 60 కిలోమీటర్ల వేగంతో గాలులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి వాతావరణ శాఖ  హెచ్చరిక జారీ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి 25 వరకు  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు నాలుగు రోజులకు ఐఎండీ ఆరెంజ్​అలర్ట్​ జారీ చేసింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. 20, 21వ తేదీల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న ఐఎండీ.. ఈ రెండు రోజులకు ఎల్లో అలర్ట్​ను ఇష్యూ చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

హైదరాబాద్​ సిటీలోనూ ఈ వారం రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. అయితే, ఇన్నాళ్లూ వర్షాల్లేక ఎండల తీవ్రత, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు.. వర్షాలు కొంచెం ఊరటనిచ్చాయి. ఇటు పంటల తడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వర్షాలు కొంత మేలు చేయనున్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం

 రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షాలు పడ్డాయి. సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్​, వికారాబాద్​, సిద్దిపేట, మెదక్​, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్​, జనగామ, హనుమకొండ, కరీంనగర్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా సత్వార్​లో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో 6.4 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా హయత్​ నగర్​లో 6.3, ఎయిర్​పోర్టు వద్ద 6, సిద్దిపేట జిల్లా మునిగడపలో 5.8, రంగారెడ్డి జిల్లా మాడ్గుల్​లో 4.9, సంగారెడ్డి జిల్లా కామ్కోల్​లో 4.8, ఆల్గోల్​లో 4.8, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో 4.7, నాగర్​కర్నూల్​ జిల్లా ఉప్పునుంతలలో 4.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన

హైదరాబాద్​ సిటీలో వాన దంచికొట్టింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. హయత్​నగర్​లో 6.3 సెంటీమీటర్లు, ఎయిర్​పోర్టు 6, శివరాంపల్లిలో 4.5, రాజేంద్రనగర్​లో 4.5, మైలార్​దేవ్​పల్లిలో 4.1, తట్టిఅన్నారంలో 3.9, రాజేంద్రనగర్​ జీహెచ్​ఎంసీ సర్కిల్​ ఆఫీస్​ వద్ద 3.8, షేక్​పేటలో 3.1, మధురానగర్​లో 3.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.