మిగులు బడ్జెట్​ ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు

మిగులు బడ్జెట్​ ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు

కోరుట్ల, వెలుగు: సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, పర్సంటేజీల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్​ భగీరథ పనులు చేపట్టి , మిగులు బడ్జెట్​ ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా గోస -బీజేపీ భరోసా యాత్ర  బైక్​ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఐబీ గెస్ట్ హౌజ్​లో విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు రైతులను మోసం చేశాడన్నారు. మిషన్​ భగీరథ పనులతో రోడ్లు తవ్వి అధ్వానంగా తయారు చేశారని, కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు డబుల్​ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణానికి ఇస్తే పేదలకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు.

ఇంటికో ఉద్యోగం పేరిట ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. ట్రిబుల్​ఐటీ, గురుకులాల్లో స్టూడెంట్లకు సరైన భోజనం పెట్టకుండా దాదాపు 460 మంది ఫుడ్​పాయిజనింగ్​కు కారణమయ్యారన్నారు. రైతు వేదికలు, శ్మశానవాటికలు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టినవేనని, కానీ తామే కట్టినట్లు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్​ పైడిపల్లి సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబారి ప్రభాకర్​, మాజీ జడ్పీ చైర్​పర్సన్​తుల ఉమ, నియోజకవర్గ ఇన్​చార్జి డా. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.