
రాష్ట్రంలో ఇంకో రెండ్రోజులు వానలు దంచి కొడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. 21 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా గత మూడ్రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో అత్యధికంగా 21 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్‌లో 20 సెంటీమీటర్ల వాన కురిసింది.
వెలుగు నెట్‌వర్క్: రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో సుమారు 21 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వానలు పడొచ్చని చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. గురువారమూ భారీ వానలు కురిశాయి. నాగర్ కర్నూల్‌లోని తెల్కపల్లెలో అత్యధికంగా 21 సెం.మీ. వాన కురిసింది. నాగర్ కర్నూల్‌లో 20 సెం.మీ., నారాయణపేట జిల్లాలోని ఉట్కూరులో 18, కామారెడ్డిలోని జుక్కల్‌లో 16, వనపర్తి జిల్లా గోపాలపేటలో 14.5, గద్వాల జిల్లా ద్యాగదొడ్డిలో 13.9, సంగారెడ్డి జిల్లాలోని సాత్వార్‌లో 13.4, వనపర్తిలోని పాన్‌గల్, రేమద్దుల, ఘన్‌పూర్‌లలో 12, మెదక్‌లోని బోడఘాట్‌లో 12, వనపర్తిలో11, రంగారెడ్డిలోని షేక్‌పేట్, బహదుర్‌పురల్లో 11 సెంటీమీటర్ల వాన కురిసింది.
సరళా సాగర్‌కు భారీ వరద
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగుతుండటంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తారు. నాగర్ కర్నూల్‌లో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, నారాయణపేటలో 15 సెంటీమీటర్ల వాన కురిసింది. వనపర్తి జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కలెక్టర్ యాస్మిన్ భాషతో కలసి వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. సరళా సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో సీఎం ఓఎస్డీ, ఇతర ఆఫీసర్లతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సందర్శించారు.
జుక్కల్‌లో 15.7 సెంటీమీటర్లు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వాన పడుతూనే ఉంది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో అత్యధికంగా 15.7 సెంటిమీటర్లు, నిజామాబాద్ జిల్లా బీమ్‌గల్‌లో 7.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. జుక్కల్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పిట్లం మండలంలో కాకివాగు ఉధృతంగా ప్రవహించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన వరద వల్ల పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని వరి పొలాలు మునిగిపోయాయి.
ఏదుల రిజర్వాయర్‌లోకి ఫ్లడ్.. నీట మునిగిన బండరావిపాకుల
వనపర్తి జిల్లాలోని నిర్వాసిత గ్రామాలను వరద ముంచెత్తడంతో వెయ్యి కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా రేవల్లి మండలంలో కడుతున్న ఏదుల రిజర్వాయర్‌లోకి భారీగా ఫ్లడ్ రావడంతో బండరావిపాకుల గ్రామం నీట మునిగింది. దీంతో 300 కుటుంబాలు ట్రాక్టర్లు , ఆటోల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. ముంపు గ్రామంగా ప్రకటించినా ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో రిజర్వాయర్‌లోనే వాళ్లు ఉంటున్నారు. ఇక భీమా లిఫ్టు స్కీమ్‌లో భాగంగా కానాయపల్లిలో కట్టిన శంకర సముద్రం రిజర్వాయర్ నిర్వాసితుల ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. విషయం తెలుసుకున్న కలెక్టర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తించడంతో గ్రామం నుంచి కొద్దిగా నీరు వెనక్కి పోయింది. శ్రీరంగాపూర్ మండలంలోని నాగరాల గ్రామస్తులదీ ఇదే పరిస్థితి.
సింగూరులో 11 టీఎంసీల నీళ్లు
స్థానిక వర్షాలు, ఎగువన కర్నాటక నుంచి వస్తున్న వరదతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు రిజర్వాయర్ నిండుతోంది. రెండ్రోజుల్లో ఏకంగా 4 టీఎంసీల నీళ్లొచ్చాయి. ప్రాజెక్టు కెపాసిటీ 29.97 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి 11 టీఎంసీల నీరుంది. నెల క్రితం ప్రాజెక్టు వాటర్‌లెవల్ 0.5 టీఎంసీలకు
పడిపోయింది.
వాగు దాటుతూ ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని సత్వార్‌లో బుధవారం రాత్రి వాగు దాటుతూ ఇద్దరు కొట్టుకుపోయారు. పొలం పనులకు వెళ్లిన ఏర్పుల రాజు(40), రాజేశ్వర్(40) చీకటిపడే టైమ్‌లో తిరిగి వస్తుండగా భారీ వర్షం పడింది. ఊరు దగ్గర్లోని వాగులో వరద ఉధృతి పెరిగింది. ఆ వాగు దాటుతూ ఇద్దరూ కొట్టుకుపోయారు. గ్రామ శివారులోని వాగులో డెడ్ బాడీలు దొరికాయి.
మిడ్ మానేరుకు భారీ ఇన్ ఫ్లో
సిరిసిల్ల జిల్లా మన్వాడలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 13 వేల283 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా 10,794 క్యూసెక్కులను ఎల్ఎండీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కెపాసిటీ 27.50 టీఎంసీలైతే 25.81 టీఎంసీలను మెయింటెయిన్ చేస్తున్నారు.
మంజీరా ఎగువన భారీ వన
రాష్ట్రవ్యాప్తంగా మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. గోదావరి, కృష్ణా, మానేరు నదులపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల గేట్లను ఇన్ ఫ్లోకు తగ్గట్టు ఓపెన్ చేస్తూ నీటిని వదులుతున్నారు. మంజీరా ఎగువన భారీ వాన కురవడంలో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి, మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు (ఘనపూర్ ఆనకట్ట)లోకి భారీగా వరద వస్తోంది. మెదక్ జిల్లా రేగొడ్ మండల పరిధిలోని గోవింద్ నాయక్ కుంట కట్ట తెగి 15 ఎకరాల్లో పత్తి చేను మునిగింది. కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లిలో 6 ఇండ్లు కూలి పోయాయి.