- ఉత్తమ పనితీరులో సెకండ్ ప్రైజ్
- రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకొన్న నవీన్ మిట్టల్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు (ఎన్ఈసీఏ) కు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ద్వితీయ బహుమతిని అందుకుంది. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూర్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఆధ్వర్యంలో ఎన్ఈసీఏ –2025 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ అవార్డును అందుకున్నారు.
ఇండస్ట్రీస్, ట్రాన్స్ పోర్ట్, బిల్డింగ్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లిలియన్స్ ఆఫ్ ది ఇయర్ కేటగిరిల్లో 17 సెక్టార్లకు సంబంధించి మొత్తం 21 అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. అలాగే జాతీయ ఇంధన పరిరక్షణ పోటీ బహుమతులను కూడా ముర్ము ప్రదానం చేశారు. తెలంగాణలో చేపట్టిన స్థిరమైన, ప్రభావంతమైన కార్యక్రమాలను గుర్తించి కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది.
ఇందులో ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) 36,746 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కూల్ రూఫ్ డెమో ప్రాజెక్టు కీలకమైందని రాష్ట్ర ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా సుమారు 7 వేల కేడబ్ల్యూహెచ్ ఇంధనం ఆదా అవుతోందని వెల్లడించింది. అలాగే రాష్ట్ర ఇంధన పరిరక్షణ నిధి (ఎస్ఈసీఎఫ్) కింద తమ శాఖ 600 ఇండక్షన్ కుక్ టాప్ లు, 600 ఇండక్షన్ ప్రెజర్ కుక్కర్లను (5 లీటర్లు) పంపిణి చేసిందని పేర్కొంది.
అంతేకాకుండా తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ టూవీలర్ రుణ పథకాన్ని అమలు చేశామని వెల్లడించింది. ఇలా ఎన్నో వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్న రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు దక్కిందని పేర్కొంది. అలాగే ట్రాన్స్ పోర్ట్ విభాగంలో రైల్వే స్టేషన్స్ సెక్టార్ లో లింగంపల్లి రైల్లే స్టేషన్, కాచిగూడ రైల్లే స్టేషన్లు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ కు అర్హత సాధించాయి.
