బెస్ట్ టూరిజం విలేజ్‌‌గా భూదాన్ పోచంపల్లి

బెస్ట్ టూరిజం విలేజ్‌‌గా  భూదాన్ పోచంపల్లి

తెలంగాణ చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. కొద్ది రోజుల కిందట కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా ఉన్న ఓరుగల్లు రామప్ప దేవాలాయనికి యునెస్కో  ప్రపంచ వారసత్వ హోదా కల్పించింది.ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్ డబ్ల్యూటివో నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ కు రాష్ట్రం నుంచి మరో గ్రామం ఎంపికయింది. ఇంతకీ ఆ విలేజ్ ఏది? అక్కడి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.  

కేరళను తలపించే అందాలు..  పాత కాలం నాటి ఇండ్లు.. పచ్చని వాతావరణం..పర్యాటకులను ఆకట్టుకునే అందాలు.. ఇవి ఎక్కడో కోనసీమ అందాలు కాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం. ఈ ఊరు ఓ సరికొత్త ఘనత దక్కించుకోబోతుంది.  ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్ డబ్ల్యూటివో  సంస్థ  బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ కు ఈ గ్రామం పోటీ పడుతోంది. దేశవ్యాప్తంగా మూడు గ్రామాలు ఈ ఘనత దక్కించుకునేందుకు పోటీలోకి దిగగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం ఒకటిగా నిలిచింది.

గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో యూఎన్ డబ్ల్యూటివో  సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన ఈ పోటీ  ప్రధాన ఉద్దేశం. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో భారత్ నుంచి మూడు గ్రామాలు ఎంట్రీ సంపాదించాయి. వాటిలో మేఘాలయ నుంచి విజిలింగ్ విలేజ్  కాంగ్ దాన్ ఒకటి కాగా.. రెండవది మధ్యప్రదేశ్ లోని  లద్ పురా ఖాస్ గ్రామం.. మూడో విలేజ్ గా తెలంగాణ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం. 

ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా లోని భూదాన్ పోచంపల్లికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశంలోనే  తొలిసారి భూదానోద్యమం ప్రారంభం అయ్యింది ఈ గ్రామం నుంచే. అప్పటి వరకు మాములు పోచంపల్లిగా పిలువబడే ఈ గ్రామం భూదాన్ పోచంపల్లి గా ప్రసిద్దికెక్కింది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇక్కడి నేతన్నలు. ఆనాటి నిజాం నవాబుతో పాటు ఇతర అరబ్ దేశాలకు తేలిక రుమాలు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన ఘనత భూదాన్ పోచంపల్లిది.ఇక్కత్ వస్త్రాలకు ఈగ్రామం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చేనేత కార్మికుల ప్రతిభ వల్ల సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు దక్కించుకుంది. ఎన్నో చారిత్రక, పర్యాటక, అంశాలు ఉన్న భూదాన్ పోచంపల్లి  బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ లో విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. మన రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలని పోచంపల్లి ప్రజలు కోరుకుంటున్నారు.