- రావాల్సింది రూ.3.76 లక్షల కోట్లు.. వచ్చింది రూ.1.84 లక్షల కోట్లే
- ఐదేండ్లలో రాష్ట్రానికి రూ.1.92 లక్షల కోట్ల నష్టం
- కేంద్రం లోపభూయిష్ట విధానాలపై ఆర్థిక నిపుణుల్లో చర్చ
- వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు
- ఈసారైనా పన్నుల వాటా పెంచి.. ప్రోత్సాహకాలు అమలు చేయాలని తెలంగాణ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: దేశ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిలా మారిన తెలంగాణకు ఆ మేరకు నిధుల పంపిణీలో మాత్రం అన్యాయం జరుగుతున్నది. సంపద సృష్టిలోనూ, పన్నుల వసూళ్లలోనూ ముందు వరుసలో ఉన్న రాష్ట్రానికి.. అందుకు తగ్గ నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. 2020–21 నుంచి 2024–25 మధ్య కాలానికి సంబంధించిన గణాంకాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా 5.01 శాతంగా ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి న్యాయంగా రూ.3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉంది. కానీ, గడిచిన ఐదేండ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1.84 లక్షల కోట్లు (2.45 శాతం) మాత్రమే. అంటే దేశానికి మనం ఇస్తున్న మొత్తంలో కనీసం సగం కూడా రాష్ట్రానికి దక్కడం లేదు.
దేశవ్యాప్తంగా ఐదేండ్లలో రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటా కింద రూ.75.12 లక్షల కోట్లు పంపిణీ చేసింది. ఇందులో జనాభా ప్రాతిపదికన, వెనుకబాటుతనం సాకుతో ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెట్టిన కేంద్రం, అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం కోతలు విధించింది. జీఎస్‌డీపీ ప్రాతిపదికన గనుక నిధుల పంపిణీ జరిగి ఉంటే.. తెలంగాణ ఖజానాకు అదనంగా రూ.1.92 లక్షల కోట్లు చేరి ఉండేవి. జాతీయ సగటు కంటే వేగంగా అభివృద్ధి చెందుతూ, దేశానికి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ, తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం కేంద్రం వివక్ష చూపుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. కాగా, అభివృద్ధిలో పోటీ పడుతున్నందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి శిక్ష వేస్తున్నట్లుగా కేంద్రం తీరు ఉందని, కనీసం ఆర్థిక సంఘం సిఫార్సులకు తగినట్లుగా కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రగతిలో ఉంటే శిక్షేనా?
ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ సత్తా చాటుతున్నది. ఈ ఐదేండ్ల కాలంలో రాష్ట్రం నుంచి రూ.4.32 లక్షల కోట్ల మేర (దేశంలో 3.87 శాతం) పన్నులు కేంద్ర ఖజానాకు చేరాయి. ఇంత భారీగా పన్నులు కడుతున్నా, తిరిగి రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో మాత్రం కేంద్రం కొర్రీలు పెడుతున్నది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణలాంటి రాష్ట్రాలు తమ సామర్థ్యానికి మించి పన్నులు కడుతుంటే.. కేంద్రం మాత్రం ఆ నిధులను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లిస్తున్నది. పన్నుల వసూళ్లు, ఆర్థిక ప్రగతికి, కేంద్రం ఇచ్చే నిధులకు మధ్య ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. కేంద్రం అనుసరిస్తున్న ఈ లోపభూయిష్ట విధానాల వల్ల ప్రగతిశీల రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారిందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి శీల రాష్ట్రాలకు కనీసం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఈ సారి ఏమయ్యేనో
పన్నుల వాటా పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరుచూ విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రానున్నా యి. దీని ప్రకారం రాష్ట్రాల సమర్థతకు పెద్దపీట వేయా లని, పన్నుల వాటాను మరింత పెంచాలని ఇప్పటికే కోరింది. ఉచితాలకు కాకుండా, ఉత్పాదకత పెంచే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేసింది.
