ఎంత ఖర్చు చేశారో జనాలకు అర్థమయ్యేలా చెప్పండి

ఎంత ఖర్చు చేశారో జనాలకు అర్థమయ్యేలా చెప్పండి

వేల కోట్లు కేటాయించి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు ప్రజాధనాన్ని మళ్లించింది. అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్లు కేటాయించారు? ఇంత వరకు ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించారు? ఎన్ని లక్షల మందికి తాగునీరు అందించారు? ఈ లెక్కలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైట్​ పేపర్​ను రిలీజ్ చెయ్యాలి.

తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగునైనా కౌగిలించుకుంటా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలివి. ఈ మాటలు నమ్మే ఎంతో మంది ఉద్యమకారులు, విద్యార్థులు కేసీఆర్ వెంటనడిచారు. ప్రాణాలకు తెగించి ప్రత్యేక తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడారు. తీరా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సీఎం అయిన కేసీఆర్.. ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగులను బొంత పురుగులకంటే హీనంగా చూస్తున్నారు. ఉద్యమకారులను ఒకవైపు తొక్కేస్తూ మరోవైపు ఉద్యమ ద్రోహులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. వారికి పదవులు కట్టబెడుతున్నారు. సకల జనుల కష్టంతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు పదవులు, ప్రయోజనాలు పొందుతున్నారు. ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతను, ఉద్యమకారులను, ఓట్లేసిన కోట్లాది మంది ప్రజలను టీఆర్ఎస్ నేతలు మోసగిస్తున్నారు. 1200 మంది అమరుల బలిదానాలను అపహాస్యం చేస్తున్నారు. పదవీ కాంక్ష, బంధుప్రీతితో పాలన సాగిస్తూ.. ఉద్యమ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. ఎన్నో త్యాగాలకు పాల్పడి తెలంగాణ కోసం కదం తొక్కిన ఉద్యమకారులనైతే శత్రువులుగా చూస్తున్నారు. జనంలో వారిని బద్నాం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉద్యమకారులపై చిన్నచూపు
ఉద్యోగులందరినీ ఏకతాటిపై నడిపించి సకల జనుల సమ్మెతో అప్పటి ఉమ్మడి అంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి చుక్కలు చూపించి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్. ఎంత ప్రయత్నించినా స్వామిగౌడ్​కు.. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్​మెంట్​ కూడా దొరకలేదు. ఉద్యమ సమయంలో ఆందోళనల్లో పాల్గొని ఎన్నో కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లిన చెరకు సుధాకర్.. ఈనాడు కేసీఆర్ దృష్టిలో గెలుపు గుర్రమే కాకపాయె. తెలంగాణ ఉద్యమాన్ని ఇంతకన్నా ముందుకు తీసుకుని వెళ్లడం తన వల్ల కాదని గ్రహించి రాజకీయ జేఏసీ పేరుతో ప్రొఫెసర్​ కోదండరామ్ చేతిలో పెట్టారు. కేసీఆర్ మాదిరిగా ఒంటెత్తు పోకడలకు పోకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లిన కోదండరామ్.. రాజకీయ పార్టీలను ఏకతాటిపై నడిపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించాడు. కానీ ఈరోజు కోదండరామ్​ను కేసీఆర్ పరమ శత్రువుగా చూస్తున్నారు. ఎందుకిలా జరిగింది. వీళ్లంతా నికార్సయిన ఉద్యమకారులు కారా? వీరంతా ఉద్యమకారులే కానీ కేసీఆర్ లాగా రాజకీయ నాయకులు కారు గనక ఇప్పుడు వీళ్ల అవసరం ఆయనకు లేదు. అందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చొని పాలన సాగిస్తుండగా, వీరంతా పోరాడి సాధించికున్న  
తెలంగాణలో హక్కులను సాధించుకునేందుకు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. 
ద్రోహులకు మాత్రం అందలం
ఉద్యమకారులను బొంత పురుగుల్లా, శత్రువుల్లా చూస్తున్న కేసీఆర్.. అసలు ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమానికి ద్రోహం చేసిన వారిని ఇప్పుడు అందలం ఎక్కిస్తున్నారు. మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి చట్ట సభల్లో కూర్చోబెడుతున్నారు. ఉద్యమంలో ముందున్న వారు ఇప్పటికీ పోరాటాలు చేస్తూ జైళ్లకు వెళుతుంటే.. ఉద్యమాన్ని కించ పరుస్తూ మాట్లాడిన నాయకులు మాత్రం ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. కౌశిక్ రెడ్డి, వెంకటరామిరెడ్డి లాంటి వాళ్ల అవసరం ఇప్పుడు ఉంది గనక వాళ్లు రాత్రికి రాత్రే ఎమ్మెల్సీలు అయిపోయారు. ప్రజలే దేవుళ్లు, వారి అభీష్టం మేరకే నడుచుకుంటానని చెప్పిన కేసీఆర్.. ఈరోజు ఏ ప్రజలు చెప్పారని ఉద్యమ ద్రోహులను 
అందలమెక్కిస్తూ, ఉద్యమకారులను అవమానిస్తూ దూరం పెడుతున్నారు.
పెట్టిన ఖర్చుల లెక్క చెప్పాలి
టీఆర్ఎస్​ ప్రభుత్వం వేల కోట్లు కేటాయించి చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై వైట్​ పేపర్​ విడుదల చేయాలి. ఇప్పటివరకు వాటికి ఎన్ని వేల కోట్లు కేటాయించారో.. అలాగే వాటి నుంచి ఎన్ని వేల ఎకరాలకు నీరందిందో, ఎన్ని లక్షల మందికి తాగు నీరందించారో తెలియజేయండి. తమ జేబులు నింపుకోవడానికి ప్రాజెక్టులను వాడుకుందే తప్ప.. వాటిని ప్రజాప్రయోజనం కోసం నిర్మించలేదు. పైగా ఇచ్చిన మాటను, హామీలను తప్పడంలో, దాన్ని సమర్థించుకోవడంలో కేసీఆర్ ను మించిన మొనగాడు చరిత్రలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ఏర్పాటు కాక ముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తానంటూ తాను ఆ పదవిని చేజిక్కించుకున్నారు. ఫస్ట్​ టర్మ్​లో దళితులకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టిన కేసీఆర్.. రెండో టర్మ్​కు వచ్చే సరికి వారికి అసలు అవకాశమే ఇవ్వలేదు. పోనీ ఎలక్షన్ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చారా? అంటే అదీ లేదు. అన్నింటినీ తుంగలో తొక్కేశారు. ఎవరైనా హామీల అమలు గురించి అడిగితే వాళ్లను తొక్కేస్తున్నారు.
బీజేపీ బలపడుతోందనే భయం మొదలైంది
కేసీఆర్​కు ప్రభుత్వ పరిపాలన మీద కన్నా రాజకీయ ఎత్తుగడల మీదనే ఎక్కువ ఆసక్తి. రాజకీయ చదరంగంలోనే రోజంతా గడుపుతుంటారని ఆయనతో ఏండ్ల తరబడి సన్నిహితంగా ఉన్నవాళ్లు చెప్తున్నారు. అయితే హుజూరాబాద్​లో బీజేపీ లీడర్​ ఈటల రాజేందర్ గెలిచినప్పటి నుంచి కేసీఆర్ కు భయం పట్టుకుంది. ఆ ఎన్నిక సమయంలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్​ ఎంతగా ప్రయత్నించారో.. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక ఇదే అని నేషనల్​ మీడియా కూడా కవరేజీ ఇచ్చింది. ఈటలను ఓడించేందుకు కేసీఆర్​ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. జనం మాత్రం ఈటలనే గెలిపించి.. కేసీఆర్ అహాన్ని దెబ్బతీశారు. అప్పటి నుంచి
 బీజేపీ అంటేనే ఆయనకు జంకు మొదలైంది. ఆ పార్టీకి తెలంగాణలో ఉనికే లేదని అంతకు ముందు మాట్లాడిన కేసీఆర్.. ఉన్నట్టుండి తాను, తన పార్టీ నాయకులతో కలిసి బీజేపీపై ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాడు. వరి కొనుగోళ్లను సాకుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేసి రాష్ట్ర ప్రజలకు బీజేపీపై పెరుగుతున్న అభిమానాన్ని తగ్గించాలని చూస్తున్నాడు.
ప్రజల ఆకాంక్షలను ఇప్పటికైనా గుర్తించాలె
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నిసార్లు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లినా తెలంగాణ అస్థిత్వాన్ని సజీవంగా ఉంచాలనే ప్రజల ఆకాంక్ష ఆయనను ప్రతిసారీ గెలిపించింది. ఉద్యమకాలంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, కవులు, రచయితలు, అర్చకులు, కార్మికులు అందరూ ఎవరికి వారు సంఘాలను ఏర్పాటు చేసుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో వారిని ప్రోత్సహించిన కేసీఆర్.. ఇప్పుడు సమస్యల మీద గళమెత్తే నాయకులను పట్టించుకోవడం లేదు. ఏకంగా ధర్నా చౌక్ నే ఎత్తేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న నిరసన తెలిపే హక్కును హరించారు. చిత్రమేమిటంటే కేంద్రంపై పోరాటం పేరుతో తాను మాత్రం అదే ధర్నాచౌక్​ వేదికగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఓట్లేసి గెలిపించిన ప్రజలను, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను కేసీఆర్​ గుర్తించాలి. ఇప్పుడు రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అంతా మీరు చెప్పినట్లుగానే నడుస్తుంది. కానీ.. ఏదో ఒకరోజు ప్రజలు కళ్లు తెరిచి వాస్తవాలు గ్రహించకమానరు. తగిన తీర్పు ఇవ్వకమానరు. ప్రజలను మభ్యపెడుతూ మీరు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చావు డప్పు మోగించకమానరు.  - సంగెం సూర్యారావు, బీసీ టైమ్స్ వ్యవస్థాపకుడు