భువనేశ్వర్: అంతర్జాతీయ వాలీబాల్ వేదికపై తెలుగు బ్లాక్ హాక్స్ జట్టు సత్తా చాటింది. భారత క్లబ్ జట్టుగా ప్రతిష్ఠాత్మక CAVA పురుషుల వాలీబాల్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తెలుగు బ్లాక్ హాక్స్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. నవంబర్ 16 నుంచి 22 వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని KIIT యూనివర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
కాంస్య పతకం కోసం కజకిస్థాన్‌కు చెందిన జెటిసు జట్టుతో జరిగిన పోరులో తెలుగు బ్లాక్ హాక్స్ 3–1 తేడాతో విజయం సాధించింది. నాలుగు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 25–23తో గెలుచుకుంది. అయితే రెండో సెట్‌లో జెటిసు జట్టు 25–21తో పైచేయి సాధించింది. అనంతరం పుంజుకున్న తెలుగు బ్లాక్ హాక్స్ మూడో సెట్‌ను 25–17తో సొంతం చేసుకుంది. నిర్ణయాత్మకమైన నాలుగో సెట్‌లోనూ 25–22తో విజయం సాధించి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఈ విజయానికి డొమినికన్ రిపబ్లిక్ ఆటగాడు హెక్టర్ అలెక్సిస్ క్రూజ్ కీలక పాత్ర పోషించాడు. తన దూకుడైన ఆటతీరుతో ఏకంగా 29 పాయింట్లు సాధించి మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అర్జెంటీనాకు చెందిన ప్రధాన కోచ్ ఏరియల్ గార్సియా మార్గదర్శకత్వంలో ఫెడెరికో పెరెయిరా, హెన్రిక్ మెయిరెలెస్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు సమష్టిగా రాణించారు.
అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో కూడిన తెలుగు బ్లాక్ హాక్స్ జట్టు సమన్వయం, పట్టుదలతో కీలక మ్యాచ్‌లో విజయం సాధించి భారత క్లబ్ వాలీబాల్‌కు మరో గుర్తింపు తీసుకొచ్చింది. CAVA ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించడం జట్టు ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచింది.
