
తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపుదల వ్యవహారం మరో కీలక మలుపు తిరుగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు లేబర్ కమిషనర్‌ను కలిశారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు పెంచకపోతే షూటింగ్స్ బంద్ చేస్తామని హెచ్చరించారు.
గతంలో సినీ నిర్మాతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వేతనాలను పెంచుతామని నిర్మాతలు గతంలో హామీ ఇచ్చారు. అయితే ఆ హామీలు నెరవేరడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపుదల విషయంలో స్పష్టమైన పురోగతి లేకపోతే, ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను పూర్తిగా నిలిపివేస్తామని ఫిల్మ్ ఛాంబర్‌కు ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. ఇదే జరిగితే సినిమా షూటింగ్ లకు విఘాతం కలిగే అవకాశం ఉంది.
►ALSO READ | నటి కల్పికను అరెస్ట్ చేయొద్దు.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం, ఫిల్మ్ ఛాంబర్‌లో ఫెడరేషన్ నాయకులు, ఛాంబర్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల ద్వారా షూటింగ్స్ బంద్ పై ఒక కొలిక్కి తీసుకువచ్చే అవకాశం ఉందని ఛాంబర్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల డిమాండ్లు, నిర్మాతల ఆర్థిక పరిస్థితుల మధ్య సయోధ్య కుదిరి, సమ్మెను నివారించగలుగుతారా లేదా అనేది ఈ సాయంత్రం జరిగే చర్చలపైనే ఆధారపడి ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మికుల పోరుపై ఉత్కంఠ నెలకొంది.