నటి కల్పికను అరెస్ట్ చేయొద్దు.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

నటి కల్పికను అరెస్ట్ చేయొద్దు.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సినీ నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. కల్పికపై నమోదైన రెండు  కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

కాగా.. 2025, మే 29న గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‎లో పబ్ యాజమాన్యానికి నటి కల్పికకు వివాదం జరిగిన సంగతి తెలిసిందే. కాంప్లిమెంటరీ కేక్ విషయంలో కల్పికకు, పబ్ సిబ్బందికి వాగ్వాదం జరగగా.. గొడవ చివరికి పోలీస్ స్టేషన్‎కు చేరుకుంది. కల్పికపై ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పబ్‎లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేస్తూ బూతులు తిట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ప్రిజం పబ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని కల్పికపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ లో కల్పికపై కేసు రిజస్టర్ అయ్యింది. దీంతో ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కల్పిక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‎పై గురువారం (జూలై 31) విచారణ చేపట్టిన హైకోర్టు.. కల్పికపై నమోదైన రెండు కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది.