అమరావతి: ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత టీమిండియా జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ శ్రీచరిణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.2.5 కోట్ల నగదు బహుమతి, 1,000 చదరపు గజాల నివాస స్థలం, గ్రూప్-I ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
శుక్రవారం ( నవంబర్ 7 ) సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఉమెన్ ఛాంపియన్స్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా శ్రీచరణిని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ అభినందించారు.
అనంతరం శ్రీచరణి, మిథాలి రాజ్‌లతో సమావేశమైన సీఎం చంద్రబాబు, లోకేష్ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను చంద్రబాబు, లోకేష్‌తో పంచుకున్నారు శ్రీచరణి. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు సీఎం చంద్రబాబు. అనంతరం శ్రీ చరణి, మిథాలీ రాజ్, క్రికెట్ జట్టు క్రీడాకారులు సంతకం చేసిన టీ-షర్టును ముఖ్యమంత్రికి బహూకరించారు.
అంతకుముందు వరల్డ్ కప్ సాధించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన శ్రీచరణికి గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు.
