
వేతానాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 13 రోజుల నుంచి నిరసన కొనసాగుతున్నా.. నిర్మాతలు పట్టించుకోవడంలేదని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలు తమను మాఫియాలాగా చిత్రీకరిస్తున్నారని, ఇది సరికాదని ఖండించారు. నిర్మాతల ఆర్థిక నష్టాలకు కార్మికులు బాధ్యులు కాదని స్పష్టం చేశారు. సినీ పెద్దలు తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.
సంపాదనలో సగం డబ్బులు వైద్యానికే ఖర్చు
ప్రస్తుతం ఒక రోజు కాల్‌షీట్‌కు ఇస్తున్న రూ.1280 వేతనం హైదరాబాద్ లాంటి నగరంలో జీవించడానికి ఏ మాత్రం సరిపోవడం లేదని కార్మికులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక వేతనం పెంపు ఉండాలని, కానీ అది జరగడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించుకోవాలని ఉన్నప్పటికీ, చిత్ర నిర్మాతలు తమతో 12 నుంచి 17 గంటల వరకు పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఈ అధిక పని గంటల వల్ల తమ ఆరోగ్యం క్షీణించి, బీపీ, షుగర్ వంటి వ్యాధులు వస్తున్నాయని, సంపాదనలో సగం డబ్బులు వైద్యానికే ఖర్చు అవుతున్నాయని వాపోయారు.
సినీ ప్రముఖులు, ప్రభుత్వాల మద్దతు కోసం విజ్ఞప్తి
తమ సమస్యలను పరిష్కరించడానికి చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి సినీ ప్రముఖులు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చొరవ తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు దాసరి నారాయణరావు వంటి సినీ పెద్దలు తమ కష్టాలను పరిష్కరించేవారని గుర్తు చేసుకున్నారు. నిర్మాతలు తమను మాఫియాలాగా చిత్రీకరిస్తున్నారని, ఇది సరికాదని ఖండించారు. నిర్మాతల ఆర్థిక నష్టాలకు కార్మికులు బాధ్యులు కాదని స్పష్టం చేశారు. అలాగే, ఆహార నాణ్యత, పంపిణీ విషయంలో తమపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తాము కేవలం నిర్మాతల ఆదేశాల ప్రకారం పని చేస్తామని వివరించారు.
►ALSO READ | అరచేతిలో సూర్యుడిని ఆపలేరు: జూ.ఎన్టీఆర్కు మాజీ మంత్రి రోజా మద్దతు
మహిళా కార్మికుల ప్రత్యేక సమస్యలు
షూటింగ్ లొకేషన్లలో కనీస సౌకర్యాలైన టాయిలెట్లు, అంబులెన్స్ సదుపాయాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లలీతా పేర్కొన్నారు. వంటపని చేసే మహిళా కార్మికులకు తాగునీటి సదుపాయం కూడా సరిగా లేదని, స్వయంగా నీటి క్యాన్లు మోసుకుని వంటపని చేసుకోవాల్సి వస్తుందని వివరించారు. వారంలో ఏడు రోజులు పని కల్పించాలని, లేకపోతే తమ జీవనం కష్టమవుతుందని ప్రభుత్వాన్ని, సినీ పెద్దలను వారు కోరారు.