దేశ ప్రజలందరికీ తెలుగు నేర్పించాలి : గవర్నర్‌‌‌‌ తమిళిసై

దేశ ప్రజలందరికీ తెలుగు నేర్పించాలి : గవర్నర్‌‌‌‌ తమిళిసై
  •      తెలుగు, తెలంగాణ భాష క్లాసిక్ 

హైదరాబాద్, వెలుగు: ప్రగతి సాధించాలంటే షార్ట్ కట్స్ ఏమీ ఉండవని, శ్రమనే మూలాధారమని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలుగు, తెలంగాణ క్లాసిక్ భాష అని, అది మాట్లాడుతుంటే ఆనందం కలుగుతుందన్నారు. ఈ భాషను దేశ ప్రజలందరికీ నేర్పించాలని పేర్కొన్నారు. మాతృభాష జీవితాంతం చైతన్యంతో ముడిపడి ఉంటుందని, మార్గదర్శకంగా ఉంటుందని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 16వ కాన్వొకేషన్ ఘనంగా జరిగింది.

 ఈ సందర్భంగా ప్రముఖ ఆంధ్ర నాట్య గురువు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళాకృష్ణకు వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందించారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ.. యూనివర్సిటీకి స్నాతకోత్సవం పెద్ద పండుగ అని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో తెలుగు భాషా పుస్తకాలను ప్రింట్ చేసి, సామాన్య ప్రజలకు అందించాలని కోరారు. తన మాతృభాష తమిళమని, మా అన్న భాష తెలుగు అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు. కళాకృష్ణ మాట్లాడుతూ.. ఆన్‌‌లైన్ ద్వారా నాట్యం నేర్చుకోవడం.. ఫిజికల్‌‌గా నాట్యం నేర్చుకోవడానికి చాలా తేడా ఉంటుందన్నారు. నాట్యాన్ని నేరుగా నేర్చుకోవడమే ఉత్తమమని చెప్పారు. 

1,189 మంది డిగ్రీల పట్టాల అందజేత..

కాన్వొకేషన్‌‌లో 1,189 మంది డిగ్రీలు, 78 మంది ఎంఫిల్, పీహెచ్‌‌డీ పట్టాలను అందుకున్నారని వర్సిటీ వీసీ తంగెడు కిషన్ రావు, రిజిస్ట్రార్ భట్టు రమేశ్‌‌ తెలిపారు. పీజీ జర్నలిజంలో టాపర్‌‌‌‌గా నిలిచిన ‘వెలుగు’ దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ శశికాంత్ రెడ్డికి గవర్నర్, వీసీ గోల్డ్ మెడల్ అందించారు.