పాస్‌పోర్టు సేవల్లో తెలుగు రాష్ట్రాలు టాప్

పాస్‌పోర్టు సేవల్లో తెలుగు రాష్ట్రాలు టాప్
  •     ప్రజలకు అందుబాటులోకి సర్వీసులు
  •     దేశంలో 507 పాస్‌పోర్టు కేంద్రాలు
  •     కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: విదేశాంగ శాఖ కృషితో దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవల్లో సమూల, సానుకూల మార్పులు జరిగాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని లక్షలాది మంది పౌరులకు పాస్ పోర్టు ఒక ముఖ్యమైన ప్రయాణ పత్రంగా, సమాజంలో ఒక గుర్తింపుగా, ఆర్థిక సాధికారతకు చిహ్నంగా నిలిచిందని అన్నారు. గతంలో పాస్ పోర్టు పొందడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి రావాల్సి వచ్చేదని చెప్పారు. అప్పట్లో ఆన్‌లైన్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు పొద్దున్నే ఇక్కడకు వచ్చి కార్యాలయం ముందు గంటల తరబడి క్యూలో నిలబడే వారని గుర్తు చేశారు. ఇది అందరికి ఇబ్బందిగా ఉండేదని, పాత భవనంలో సరైన సౌకర్యాలు లేక ఉద్యోగులు, జనం తీవ్ర సమస్యలను ఎదుర్కొనే వారన్నారు. ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లయిందని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసును రినవేషన్ చేసిన సందర్భంగా గురువారం కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తో కలిసి కిషన్ రెడ్డి వర్చ్యువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాలు బెస్ట్

కిషన్ రెడ్డి మాట్లాడుతూ పాస్ పోర్టు జారీ ప్రక్రియలో పోలీసు ధ్రువీకరణ కీలకమైన అంశమన్నారు. దీంతో విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలకు సరికొత్త టెక్నాలజీని అందించి, ఫాస్ట్ ట్రాక్ ధ్రువీకరణ ప్రక్రియను అనుసరించేలా చర్యలు తీసుకున్నాయని చెప్పారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మంచి పనితీరు కనబరిచాయని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. పాస్‌పోర్టు సేవలకు పోలీస్ యాప్‌ను ఉపయోగించాలని ఢిల్లీ పోలీసులు ఇటీవల నిర్ణయించారని కిషన్ రెడ్డి చెప్పారు. పాస్ పోర్టుకు అప్లై చేసే విధానంతో పాటు రూల్స్ ను ఈజ్ చేయటంతో ఇప్పుడు ఈ శాఖ సేవలు అందరికి అందుబాటులోకి వచ్చాయన్నారు.

పోస్టాఫీసుల్లోనూ..

దేశంలో 2016 వరకు 90 పాస్‌పోర్టు కేంద్రాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు  దేశంలో 507 కేంద్రాలు ఉన్నాయని కిషన్​రెడ్డి అన్నారు. పోస్టాఫీసుల్లో కూడా పాస్ పోర్టు సేవా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 14 పోస్టాఫీసుల్లో కూడా ఈ సేవలు అందిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ, సకాలంలో ఈ ఆఫీసును మళ్లీ నిర్మించిన కేంద్ర ప్రజా పనుల విభాగం సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మెహమూద్ అలీ, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్ రెడ్డితోపాటు విదేశాంగ శాఖ, కేంద్ర ప్రజా పనుల విభాగం సీనియర్ అధికారులు పాల్గొన్నారు.