కీవ్​లో ఉన్నోళ్లు..  బంకర్లలోనే

కీవ్​లో ఉన్నోళ్లు..  బంకర్లలోనే

తిండి లేదని తల్లిదండ్రులతో మనోళ్ల ఆవేదన
రుమేనియాకు చేరుకున్న 19 మంది 

హైదరాబాద్/హనుమకొండ సిటీ/న్యూఢిల్లీ, వెలుగు:  ఉక్రెయిన్ లోని తెలుగు స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ దేశ రాజధాని కీవ్ ను రష్యా బలగాలు చుట్టుముట్టి, బాంబుల వర్షం కురిపిస్తుండడంతో బంకర్లలోనే తలదాచుకుంటున్నారు. భయంభయంగా ఉందని తల్లిదండ్రులకు ఫోన్ లో చెబుతూ ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనగా ఉందని.. పిల్లల నుంచి ఫోన్ కాల్, మెసేజ్ రాకపోతే భయంగా ఉంటోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ‘‘కీవ్ లో ఉదయం నుంచి బాంబులు పేలుతున్నాయి. బాంబుల శబ్దం వినిపించగానే అపార్ట్ మెంట్ నుంచి బంకర్లలోకి పరుగులు తీశాం. సాయంత్రం బిల్డింగులపై బాంబులు వేశారు. ఆకాశంలో జెట్స్ తిరుగుతున్న శబ్దాలు వినిపించాయి” అని సికింద్రాబాద్ కు చెందిన అనీలా శనివారం తన తండ్రి మనోహర్ తో ఫోన్ లో చెప్పింది. సైరన్ సౌండ్ వినిపిస్తే బంకర్లలోకి పోయి తలదాచుకుంటున్నామని, కానీ అక్కడ సరైన సౌలతులు లేవని వాపోయింది. ఆమె మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ కు వెళ్లింది. కాగా, 19 మంది తెలుగు స్టూడెంట్లం ఉక్రెయిన్ లోని విన్నిట్సా నుంచి రుమేనియా బార్డర్ కు చేరుకున్నామని శంషాబాద్ కు చెందిన నిషారాణి తన తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పింది. ‘‘బార్డర్ వద్ద జనం గుమిగూడారు. దాదాపు 3 వేల మందికి పైగా వచ్చారు. 19 మందిమి తెలుగు స్టూడెంట్లం బార్డర్ దాటి ఇండియన్ ఎంబసీ అధికారులను కలుసుకున్నాం. వారి సహకారంతో రుమేనియా ఎయిర్ పోర్టుకు బయలుదేరాం” అని ఆమె తెలిపింది. అక్కడి పరిస్థితులను వీడియో తీసి పేరెంట్స్ కి వాట్సాప్ చేసింది. బార్డర్ నుంచి ఎయిర్ పోర్టు దాదాపు 600 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. 

అందరినీ తీసుకొస్తం: కిషన్ రెడ్డి 
ఉక్రెయిన్ లోని మన స్టూడెంట్లందరినీ తీసుకొస్తామని, అప్పటి వరకు మిషన్ ఆగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ప్రత్యేక విమానాలను పంపించి, ప్రభుత్వ ఖర్చులతో స్టూడెంట్లను తీసుకొస్తున్నామని తెలిపారు. స్టూడెంట్ల తరలింపుపై విదేశాంగ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. స్టూడెంట్లను వీలైనంత త్వరగా తీసుకొస్తామని అధికారులు భరోసా ఇచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. స్టూడెంట్లను తీసుకురావడానికి కేంద్రం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. కాగా, ఢిల్లీకి చేరుకునే తెలంగాణ స్టూడెంట్లను సొంతూళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. కంట్రోల్ రూమ్ కు స్టూడెంట్లు, పేరెంట్స్ నుంచి కాల్ వస్తున్నాయని తెలిపారు. దాదాపు 800 మందికి పైగా తెలంగాణ స్టూడెంట్లు ఉక్రెయిన్ లో ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. వాళ్లను తీసుకొచ్చేందుకు హంగేరి, పోలాండ్, రుమేనియా దేశాల ఎంబసీలతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. 

ఫుడ్ అయిపోతంది.. 
‘‘ఉక్రెయిన్​లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మా దగ్గరున్న వాటర్, ఫుడ్ అయిపోతున్నాయి. బాంబులు, సైరన్​శబ్దాలతో భయమేస్తోంది. బాంబులు ఎప్పుడు మీద పడతాయోనని నిద్రపట్టడం లేదు” అంటూ హనుమకొండకు చెందిన వేమునూరి ప్రియాన్ష్​ఆవేదన వ్యక్తం చేశాడు. విన్నిట్సాలో ఉంటున్న అతడు పేరెంట్స్ కు సెల్ఫీ వీడియో పంపాడు. తమను ఇండియా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​కు  విజ్ఞప్తి చేశాడు. 

వీడియో కాల్​లో ధైర్యం చెప్తున్నం 
మా అమ్మాయి హైమావతి 2017లో ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ మెడిసిన్ చదువుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి మా కుటుంబమంతా భయపడుతోంది. మా అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతూ ధైర్యం చెప్తున్నం.  
- ఆది నారాయణ రావు, ఓల్డ్ అల్వాల్