ఓటమితో సీజన్ స్టార్ట్: తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు

 ఓటమితో సీజన్ స్టార్ట్: తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు

వైజాగ్: ప్రో కబడ్డీ లీగ్ 12వ ఎడిషన్‌‌‌‌ను తెలుగు టైటాన్స్ ఓటమితో ఆరంభించింది. వైజాగ్‌‌‌‌లో శుక్రవారం రాత్రి జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌‌‌‌లో తలైవాస్ 38–35 తేడాతో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్‌‌‌‌ను ఓడించింది. టైటాన్స్ ఓ దశలో 27–20తో విజయం సాధించేలా కనిపించినా.. ఆఖరి క్షణాల్లో తలైవాస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ పవన్ సెహ్రావత్ సూపర్ రైడ్‌‌‌‌తో తెలుగు జట్టుకు షాకిచ్చాడు. 

తలైవాస్ స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్‌‌‌‌ 12 పాయింట్లతో సూపర్ టెన్ సాధించగా, పవన్ 9 పాయింట్లతో రాణించాడు. తెలుగు టైటాన్స్ ఆల్‌‌‌‌రౌండర్ భరత్ 11 పాయింట్లతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది. టై బ్రేక్‌‌‌‌కు దారి తీసిన మరో మ్యాచ్‌‌‌‌లో పుణెరి పల్టాన్  32–32 (6–4)తో బెంగళూరు బుల్స్‌‌‌‌ను ఓడించింది. 

తొలుత ఇరు జట్లూ చెరో 32  పాయింట్లతో సమంగా నిలిచాయి. విన్నర్‌‌‌‌‌‌‌‌ను తేల్చేందుకు  ఈ సీజన్‌‌‌‌లో కొత్తగా ప్రవేశపెట్టిన టై బ్రేకర్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇరు జట్లతో వరుసగా ఐదేసి రైడ్స్‌‌‌‌ చేయించారు. ఇందులో సత్తా చాటిన పుణెరి విజయం అందుకుంది. కాగా, శనివారం జరిగే మ్యాచ్‌‌‌‌ల్లో యూపీ యోధాస్‌‌‌‌తో తెలుగు టైటాన్స్‌‌‌‌, యు ముంబాతో గుజరాత్ జెయింట్స్‌‌‌‌ పోటీపడతాయి.