రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలితీవ్రత

రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలితీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్ర అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణస్థాయి కంటే దిగువకు పడిపోవడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరుగుతోంది. 

చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 16 డిగ్రీల సెల్సీయస్ కంటే తక్కువగా ఉన్నాయి. సాధారణంగా అక్టోబర్, ఫిబ్రవరి మధ్య మధ్యలో చలి ఎక్కువగా ఉంటుంది.  అయితే, ఈ సంవత్సరం, ఎల్నినో కారణంగా నగరంలో కాస్త ఆలస్యంగా డిసెంబర్ లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం పూట పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 దాటినా రోడ్లు కనిపించక తిప్పలు పడుతున్నారు.  

మిగ్ జాం తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో జనం వణుకుతున్నారు. చలిగాలులతో ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సిర్పూర్ (యూ)లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 10.5 డిగ్రీల సెల్సియస్, కుమురం భీమ్ లో, హైదరాబాద్ లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు, మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్‌ మేర క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) అంచనా వేసింది.