రాష్ట్రంలో పొద్దంతా ఎండలు.. రాత్రేమోచలి

రాష్ట్రంలో పొద్దంతా ఎండలు.. రాత్రేమోచలి
  • నల్గొండలో అత్యధికంగా 37 డిగ్రీలు నమోదు
  • రానున్న మూడ్రోజుల్లో మరింత పెరిగే చాన్స్   
  • ఈ సారి ఎండలు ఎక్కువేనన్న వాతావరణ శాఖ 
  • మరోవైపు పడిపోతున్న రాత్రి టెంపరేచర్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి రాకముందే సుర్రుమంటున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర అధిక టెంపరేచర్లు నమోదవుతున్నాయి. మంగళవారం నల్గొండలో 37, భద్రాచలం, ఖమ్మంలో 36, ఆదిలాబాద్‌‌‌‌లో 35.3, హైదరాబాద్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌లో 35 డిగ్రీల చొప్పున గరిష్ట టెంపరేచర్లు రికార్డయ్యాయి. రానున్న మూడ్రోజులు పొడి వాతావరణమే ఉంటుందని.. మరో మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఎండలు ఎక్కువేనంట... 

ఈసారి ఎండలు ఎక్కువగానే ఉంటాయని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర అధిక టెంపరేచర్లు నమోదవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల 30 డిగ్రీల గరిష్ట టెంపరేచర్లు నమోదవుతున్నాయని, కొన్ని చోట్ల 34 డిగ్రీలు దాటాయని పేర్కొన్నారు. ఈసారి వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయని.. మార్చి, ఏప్రిల్​లో ఎక్కువ ఎండలతో పాటు వడగాల్పులు ఉంటాయన్నారు. మార్చి, జూన్‌‌‌‌లో ఉరుములు, మెరుపులతో వానలు పడొచ్చన్నారు.  

రాత్రేమో చలి.. 

మధ్యాహ్నం ఎండలు మండిపోతుంటే, రాత్రి మాత్రం చలి పెడుతోంది. రాష్ట్రంలో నైట్‌‌‌‌ టెంపరేచర్స్‌‌‌‌ పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. 10 డిగ్రీలు, అంత కంటే తక్కువగా కనిష్ట టెంపరేచర్లు రికార్డవుతుండడంతో చలి తీవ్రత తగ్గడం లేదు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌‌‌‌లో 10 డిగ్రీల నైట్‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌ రికార్డయ్యింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌‌‌‌లో 10.2, రంగారెడ్డిలో 11.4, వికారాబాద్‌‌‌‌, నిర్మల్‌‌‌‌లో 11.9, మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరిలో 12, సంగారెడ్డిలో 12.4, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12.6 డిగ్రీల చొప్పున నైట్ టెంపరేచర్స్‌‌‌‌ రికార్డయ్యాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరులో 20 డిగ్రీల దాకా కనిష్ట టెంపరేచర్లు నమోదవుతుంటాయి.