ఆలయ సొమ్ము దేవుడిదే.. సహకార బ్యాంకులను కాపాడేందుకు దేవుడి నిధులు వాడొద్దు: సుప్రీంకోర్టు

ఆలయ సొమ్ము దేవుడిదే.. సహకార బ్యాంకులను కాపాడేందుకు దేవుడి నిధులు వాడొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆలయ సొమ్ము దేవుడికే చెందుతుందని, ఆ ఆలయ నిధులను సహకార బ్యాంకులను కాపాడేందుకు వాడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. తిరునెల్లి ఆలయ దేవస్వొంకు చెందిన ఫిక్స్ డ్  డిపాజిట్  నిధులను తిరిగి ఆలయానికే ఇవ్వాలని కేరళ హైకోర్టు గతంలో పలు సహకార బ్యాంకులను ఆదేశించింది. 

ఆ ఆదేశాలను సవాలుచేస్తూ మనంతవాడి కోఆపరేటివ్  అర్బన్  సొసైటీ లిమిటెడ్, తిరునెల్లి సర్వీస్  కోఆపరేటివ్  బ్యాంక్  లిమిటెడ్.. సుప్రీంకోర్టులో పిటిషన్  వేశాయి. ఈ పిటిషన్​ను విచారించిన సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్  సూర్యకాంత్, జస్టిస్  జోయ్ మాల్యా బాగ్చీతో కూడిన బెంచ్  ఈ వ్యాఖ్యలు చేసింది.

 ‘‘బ్యాంకులను కాపాడేందుకు ఆలయ నిధులను వాడాలనుకుంటున్నారు. ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న బ్యాంకుల్లో ఆలయ నిధులు ఉండడం కరెక్టు కాదు. దానికి బదులుగా ఆరోగ్యకరమైన జాతీయ బ్యాంకుల్లో ఆలయ నిధులు ఉంటే ఏమవుతుంది. ఆలయ నిధులు దేవుడికే చెందుతాయి. ఆ నిధులను ఆలయ ప్రయోజనాల కోసమే వాడాలి. సహకార బ్యాంకులకు ఆలయ నిధులు ఆదాయ వనరు కాకూడదు. కస్టమర్లను ఆకర్షించకపోతే అది మీ (బ్యాంకులు) సమస్య” అని బెంచ్  వ్యాఖ్యానించింది. 

సహకార బ్యాంకుల పిటిషన్ ను బెంచ్  కొట్టివేసింది. అయితే, కేరళ హైకోర్టు విధించిన రెండు నెలల గడువును పొడిగించేందుకు ఆ హైకోర్టును ఆశ్రయించేందుకు సహకార బ్యాంకులకు బెంచ్  అనుమతి ఇచ్చింది.