
యాదగిరికొండ వెలుగు: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఒకే ధర, ఒకే పరిమాణంతో బెల్లం లడ్డూలను తయారు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. బెల్లం లడ్డూ పరిమాణం 80 గ్రాములు, ధర రూ.25గా నిర్ణయించారు. బెల్లం లడ్డూలకు ముడి సరకులు ఏవిధంగా వాడాలనే విధి విధానాలను కూడా కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెల్లం ఆరోగ్యానికి మంచిదని ఆలయాల్లో బెల్లం లడ్డూలను ప్రవేశపెడుతున్నారు. బెల్లంతో తయారు చేసిన లడ్డూలతో షుగర్, బీపీ, అలర్జీ దూరమవుతాయంటారు.
లడ్డూ తయారీ ఇలా…
చెక్కర లడ్డూ ప్రసాదాల తయారీ చేసేవిధంగానే బెల్లం లడ్డూలను తయారు చేస్తారు. శనగపిండి మిశ్రమాన్ని వేడి చేసిన నెయ్యిలో జల్లించి బూందీ సిద్దం చేస్తారు. బెల్లం ముద్దలను పగులగొట్టి పానకం తయారు చేస్తారు. పానకంలోని చెరుకు గడల పిప్పిని వేరు చేస్తారు. ఫిల్టర్ చేసిన పానకాన్ని మరోసారి వేడి చేసి ముదురు పానకం తయారు చేసి లడ్డూ బూందిలో కలిపి బెల్లం లడ్డూ మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. ఈ మిశ్రమంలో తగు పరిమాణంలో కాజూ, కిస్మిస్, ఇలాచీ, జాజికాయ, పచ్చ కర్పూరం కలిపి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తారు.
యాదాద్రిలో పెరిగిన గిరాకీ
యాదాద్రిలక్ష్మీనరసింహుడి సన్నిధిలో కొత్తగా బెల్లం పానకంతో తయారు చేస్తున్న లడ్డూలకు గిరాకి పెరిగింది. బెల్లం లడ్డూలను దేవస్థాన సిబ్బంది తయారు చేసి కౌంటర్లలో విక్రయిస్తున్నారు. ఇకపై చక్కెర లడ్డూలతో సమానంగా బెల్లం లడ్డూలను విక్రయించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 15వ తేదీ ఇప్పటి వరకు భక్తులకు 10,160 బెల్లం పానకంతో తయారు చేసిన లడ్డూలను విక్రయించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.