కరోనా వారియర్స్‌: గుడిని శానిటైజ్‌ చేస్తున్న ముస్లిం మహిళ

కరోనా వారియర్స్‌: గుడిని శానిటైజ్‌ చేస్తున్న ముస్లిం మహిళ
  • ఢిల్లీలో సేవలందిస్తున్న ఇమ్రానా సైఫీ
  • అడ్డుచెప్పని పూజార్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిన ఎదుర్కొనేందుకు డాక్టర్లు, పోలీసులు, శానిటైజేషన్‌ వర్కర్లు నిరంతరం కృషి చేస్తున్నారు. వారితో పాటు కొంత మంది సామన్య ప్రజలు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ శానిటేజేషన్ స్ర్పే చేయడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీకి చెందిన ఇమ్రానా సైఫీ అనే ఒక ముస్లిం మహిళ తన వంతుగా అన్ని గుళ్లలో, మసీదుల్లో, ఇళ్లల్లో, వీధుల్లో శానిటైజేర్‌‌ను స్ర్పే చేస్తూ అందరికీ ఆదర్శంనగా నిలుస్తోంది. బుర్ఖా వేసుకుని గుడి లోపలికి వెళ్లి ప్రతి మూలను శానటైజ్‌ చేస్తోంది. దానికి పూజార్లు కూడా సహకరిస్తున్నారని, ఇలా చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఢిల్లీకి చెందిన ఇమ్రానా ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆమె మొదటి నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ వ్యతిరేక అల్లర్లలో కూడా చాలా మందికి సాయం చేశారు. కరోనా కాలం మొదలైనప్పటి నుంచి ఆమె కాలనీలోకి నలుగురు మహిళలతో “ కరోనా వారియర్స్‌” అని టీమ్‌గా ఏర్పడి శానిటైజర్‌‌ స్ర్పే చేస్తోంది. ఢిల్లీలోని జఫ్రాబాద్‌, ముస్తఫాబాద్‌, చాంద్‌భాగ్‌, నెహ్రూ విహార్‌‌, శివ్‌ విహార్‌‌, బాబూ నగర్‌ తదితర ప్రాంతాల్లో రోజూ శానిటైజర్‌‌ మిషన్‌ వేసుకుని కనిపిస్తుంది. “ మనమంతా ఒకటే అని నిరూపించాలనుకుంటున్నాను. గుడిలోకి వెళ్తుంటే పూజార్లు మమ్మల్ని ఆపలేదు. మేం ఎక్కడ ఎవరితో ఇబ్బంది పడలేదు. ఇది చాలా భయంకరమైన వ్యాధి అని అందరికీ తెలుసూ అందుకే మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేదు” అని ఇమ్రానా చెప్పారు. “ మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి పనులను మెచ్చుకోవాలి. మనం అందరం కలిసి ఉండాలి. ఒకరినొకరు ప్రేమిస్తూ ఆనందంగా ఉండాలి” అని నెహ్రూ విహార్‌‌లోని నవ దుర్గా మందిర్‌‌ పూజారి పండిట్‌ యోగేశ్‌ కృష్ణ అన్నారు.