అప్పుల బాధతో   కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో   కౌలు రైతు ఆత్మహత్య

కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అప్పుల బాధతో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఆరేపల్లి పరిధి చంద్రనాయక్ తండాకు చెందిన బానోతు రమేశ్(24) ఈయేడు 4 ఎకరాలు కౌలుకు తీసుకొని రెండెకరాల్లో పత్తి, మరో రెండు ఎకరాల్లో వరి వేశాడు. వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతినగా.. వరి పంట కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. వీటికి తోడు కుటుంబాన్ని పోషించేందుకు ఫైనాన్స్​లో ఆటో తీసుకున్నాడు. దాదాపు రూ.4 లక్షల వరకు అప్పు అయింది. ఇటు పంటలు పండకపోగా, అటు కిస్తీ కట్టడం లేదని ఆటోను ఫైనాన్స్​వారు తీసుకెళ్లారు. అప్పు తీర్చే మార్గం కనిపించక ఈ నెల 3న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని సిద్దిపేట సర్కారు దవాఖానకు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ ​శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పవన్ కుమార్ తెలిపారు.