హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్​..

హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్​..

హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్​.. మళ్లీ టెండర్లు పిలుస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం కింద స్కూళ్లకు డ్యూయల్‌‌ డెస్క్‌‌లు, ఇతర ఫర్నీచర్‌‌ కొనుగోలుకు సంబంధించిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డ్యూయల్‌‌ డెస్క్‌‌లకు రూ. 360 కోట్లు, ఫర్నీచర్‌‌కు రూ.195 కోట్ల టెండర్లను ఆహ్వానించడాన్ని సవాల్‌‌ చేస్తూ దాఖలైన కేసుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామని తెలియజేసింది. మొన్నామధ్య ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం కింద 26,065 స్కూళ్లలో వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,539 కోట్లకు టెండర్లను పిలిచింది. పాఠశాల విద్యా శాఖ, రాష్ట్ర విద్యా, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌‌ (టీఎస్‌‌ఈడబ్ల్యూఐడీసీ) ఈ టెండర్లు ఆహ్వానించింది. 

టెండర్స్‌‌కు వీ3 ఎంటర్‌‌ ప్రై జెస్‌‌  ప్రైవేట్‌‌ లిమిటెడ్, జెనిత్‌‌ మెటఫాస్ట్‌‌ ప్రైవేట్​ లిమిటెడ్, కేంద్రీయ భండార్‌‌ల ఉమ్మడి వెంచర్‌‌ సంస్థలకు అర్హతలు లేవని అధికారులు తేల్చారు. దీంతో తమకు అన్ని అర్హతలు ఉన్నా కాంట్రాక్టు పొందేందుకు అర్హత లేదని అధికారులు ఎట్ల నిర్ణయిస్తారని ఆ సంస్థలు హైకోర్టులో రిట్లు దాఖలు చేశాయి. వీటిని సోమవారం జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారణ చేపట్టారు. గవర్నమెంట్‌‌ స్పెషల్‌‌ ప్లీడర్‌‌ సంజీవ్‌‌కుమార్‌‌ స్పందిస్తూ.. డ్యూయల్‌‌ డెస్క్, ఫర్నీచర్‌‌ టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తుందని తెలిపారు. 

అర్హతలు లేని సంస్థను గుర్తించడమేంది? 

ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లలో కుర్చీలు, టేబుల్స్, ఇతర ఫర్నీచర్‌‌ కొనుగోలు టెండర్‌‌ ప్రక్రియను ఖరారు చేయవద్దని ఈ నెల 6న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు టెండర్లను ఖరారు చేయరాదని, టెండర్‌‌ నోటిఫికేషన్‌‌ ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని స్పష్టం చేసింది. టెండర్ల ప్రక్రియపై పూర్తి వివరాలను నివేదించాలని రాష్ట్రానికి ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సోమవారం రిట్లపై హైకోర్టు విచారణ చేపట్టగానే ప్రభుత్వం డ్యూయల్‌‌ డెస్క్‌‌ లు, ఫర్నీచర్‌‌ టెండర్లను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఏడాది  మే 9న జారీ చేసిన టెండర్‌‌ నోటిఫికేషన్‌‌ నిబంధనలకు తగ్గట్టుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అనర్హత కాంట్రాక్టర్‌‌గా అధికారులు తేల్చారంటూ కేంద్రీయ భాండార్‌‌, జెనిత్‌‌ మెటప్లాస్ట్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్, వీ 3 ఎంటర్‌‌ ప్రైజెస్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ హైకోర్టును ఆశ్రయించాయి. ఎలెగంట్‌‌ మెథడాక్స్‌‌ అనే సంస్థ నిబంధనల ప్రకారం ఉందని అధికారులు తేల్చడాన్ని పిటిషనర్లు హైకోర్టులో సవాల్‌‌ చేశారు.

 టెండర్‌‌ రూల్స్‌‌కు తగ్గట్టుగా తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అధికారులు తిరస్కరించారని పిటిషనర్ల తరఫు లాయర్‌‌ అవినాష్‌‌ దేశాయ్‌‌ గతంలో వాదించారు. గడిచిన ఐదేండ్లలో ఒక ఏడాది రూ.180 కోట్ల టర్నోవర్‌‌ పిటిషనర్ల కంపెనీలకు ఉందని, ఏపీలోని స్కూళ్లకు మెటీరియల్స్‌‌ సప్లయ్‌‌ చేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. అర్హతలు లేని ఎలెగంట్‌‌ మెథడాక్స్‌‌ అనే సంస్థను రాష్ట్రం గుర్తించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం టెండర్ల రద్దు నిర్ణయానికి రావడంతో ఆ రెండు రిట్లపై హైకోర్టు విచారణను ముగించింది. గ్రీన్‌‌ బోర్డుల సరఫరా వ్యవహారంపై జి.రేవంత్‌‌, మరొకరు దాఖలు చేసిన పిటిషన్లు ఇంకా విచారణలో ఉన్నాయి.