
హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ ఏఓసీ (ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్) సెంటర్ సమీపంలో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ వచ్చే వారం టెండర్లు పిలవనుంది. హెచ్-సిటీ పనుల్లో భాగంగా రూ.960 కోట్లతో ఈ ప్రాజెక్టును బల్దియా చేపట్టనుంది. ఇందుకోసం 42.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా ఆర్మీ ల్యాండ్ లీగల్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎస్కే చెట్టితో సహా ఆర్మీ అధికారులతో శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మరోసారి సమావేశమై చర్చించారు. ఈ భూమికి బదులుగా సమాన విలువ గల భూమిని అందించాలని ఆర్మీ కోరగా, ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉందన్నారు. త్వరలో భూమిని అప్పగిస్తామని కమిషనర్ తెలిపారు.
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ రద్దీతో నిత్యం మిలటరీ ఏరియాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో మారేడ్‌పల్లి నుంచి ఏఓసీ, మిలిటరీ హాస్పిటల్ ప్రాంతాల నుంచి వెళ్లే రోడ్లకు బదులుగా.. మారేడ్‌పల్లి, సఫిల్‌గూడ, ఆర్కేపురం మార్గాల ద్వారా రోడ్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 6.07 కిలోమీటర్ల మేర 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. మిలటరీ ఏరియాలో నిర్మించే ఈ రోడ్డుకు కనెక్టింగ్‌గా ఆర్కేపురం వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ), రైల్ అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)లను కూడా నిర్మించనుంది.
ఈ రోడ్డు పూర్తయితే సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి, నేరెడ్‌మెట్, ఈసీఐఎల్‌కు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పనున్నాయి. సమావేశంలో ఆర్మీకి చెందిన స్టాఫ్ ఆఫీసర్ ల్యాండ్ కల్నల్ విజు సుందరేశ్, ఏఓసీ సెంటర్ నాయబ్ సుబేదార్ సబ్బిర్ ఖాన్, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) భాస్కర్ రెడ్డి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.