మహబూబ్ నగర్ లో ఒక్క రాత్రి లో మారిన సమీకరణలు ...ఈజీ గా గెలుస్తామన్న చోట టఫ్ఫైట్ ఇచ్చిన అభ్యర్థులు

మహబూబ్ నగర్ లో ఒక్క రాత్రి లో మారిన సమీకరణలు ...ఈజీ గా గెలుస్తామన్న చోట టఫ్ఫైట్ ఇచ్చిన అభ్యర్థులు
  •  గెలుపోటములపై క్యాండిడేట్లలో ఉత్కంఠ
  • నేడు కౌంటింగ్
  • ​ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు :  మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పోలింగ్​ ముగియగా, కౌంటింగ్​కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  కొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీల క్యాండిడేట్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈజీగా గెలుస్తామన్న వార్డులు, డివిజన్లలో సమీకరణలు మారడంతో రిజల్ట్​ ఎలా ఉండబోతోందని వారిలో ఆందోళన మొదలైంది. 

ఆయా స్థానల్లో తమకు ఓటర్లు అనుకూలంగా ఉన్నారని భావించగా.. పోలింగ్​కు కొన్ని గంటల ముందు ప్రత్యర్థి పార్టీల క్యాండిడేట్లు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేయడంతో వారు యూ టర్న్​ తీసుకున్నట్లు తెలిసింది. దీనికితోడు రాత్రి ‘మా ఓటు మీకే’ అని చెప్పిన వారు కూడా తెల్లారే సరికి ప్రత్యర్థి అనుచరుల బైకులు, కార్ల మీద వచ్చి ఓట్లు వేసి వెళ్లడంతో కొందరు ఖంగుతిన్నారు. దీనికితోడు  పలు చోట్ల ఇండిపెండెంట్లు సైతం ప్రభావం చూపడంతో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి

మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లోని పలు మున్సిపాల్టీల్లోని మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య, మిగతా చోట్ల కాంగ్రెస్​, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. కానీ కొన్ని మున్సిపాల్టీల్లో క్యాండిడేట్లు వీక్​గా ఉన్న చోట ఒకరికొకరు సహకరించుకోవాలని రెండు ప్రధాన పార్టీలు తెరవెనుక ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ మేరకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. కాని ఈ స్కెచ్​ బెడిసి కొట్టినట్లు తెలిసింది. ఉదాహరణకు దేవరకద్ర మున్సిపాల్టీలో అంతర్గత పోత్తులు పెట్టుకుంటున్న రెండు పార్టీలకు చెందిన క్యాండిడేట్లు ఓ సామాజిక వర్గం ఓటర్లతో పోలింగ్​కు ఒక రోజు ముందు సమావేశం అయ్యారు. 

తమకు గంప గుత్త ఓట్లు వేయాలని కోరారు. మీ సామాజిక వర్గానికి అండగా ఉంటామని హామీలు ఇచ్చారు. కానీ పోలింగ్​రోజు తెల్లవారుజామున ఈ వర్గానికి చెందిన ఓటర్లు మనసు మార్చుకుని అధికార పార్టీకి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. మక్తల్​లోనూ ఇలాగే అంర్గతర పోత్తులు పెట్టుకోగా, అక్కడా వీరి ప్రయత్నం బెడిసి కొట్టినట్లు తెలిసింది. దీంతో ఆయా స్థానాల్లో ఒకరికొకరు సపోర్ట్​ చేసుకొని ఈజీగా గెలవాలని అనుకోగా, అధికార పార్టీ లీడర్లు అలర్ట్​ కావడంతో పరిస్థితి తారుమారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కీ రోల్​ పోషించనున్న బీజేపీ, ఇండిపెండెంట్లు

ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలోని 18 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్​ పరిధిలోని 375 స్థానాలకు 1,572 మంది క్యాండిడేట్లు పోటీ పడగా.. మహబూబ్​నగర్​ కార్పొరేషన్​ పరిధిలోని ఒక డివిజన్​ ఏకగ్రీవమైంది. మక్తల్​ మున్సిపాల్టీలోని ఆరో వార్డు అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో మొత్తం 373 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1,570 మంది బరిలో నిలిచారు. 

అయితే మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీయే జెండా ఎగరేస్తుందని సర్వేలు, ఎగ్జిట్​ పోల్స్​ చెబుతుండగా, పలు మున్సిపాల్టీల్లో చైర్మన్​ పీఠాలు కైవసం చేసుకోవడంలో బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్​ క్యాండిడేట్లు కీ రోల్​ పోషించనున్నారు. వీరి మద్దతుతో మరిన్ని మున్సిపాల్టీలను అధికార పార్టీ చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ మున్నిపాలిటీల్లో ఎవరి లెక్కలు వాళ్లవే.. 

నాగర్ కర్నూల్/ గద్వాల/వనపర్తి : నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, ఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగడంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపు కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన అభ్యర్థులను ఇప్పుడు ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న టెన్షన్ పీడిస్తోంది. ఈ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఈసారి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

నాగర్ కర్నూల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ అభ్యర్థులు ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యేల అండతో గెలుపుపై ధీమాగా ఉండగా, గద్వాల జిల్లాలో కొన్ని చోట్ల హంగ్ ఏర్పడే సూచనలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుండగా, ఆలంపూర్‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. వనపర్తిలో చైర్​పర్సన్ పీఠం దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 

ముఖ్యంగా రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు గెలిస్తే, వారు చైర్మన్ ఎన్నికలో కీలకం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట లోపే మున్సిపల్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టకుండా ఉండేందుకు, ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు సిద్ధమయ్యాయి. ప్రధాన వార్డుల్లో ఓటుకు భారీగా నగదు పంపిణీ జరగడంతో, ఆయా వార్డుల ఫలితాలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.