డీఎస్పీ పోస్టులకు ఏజ్ లిమిట్‌పై  నిరుద్యోగుల్లో టెన్షన్

డీఎస్పీ పోస్టులకు ఏజ్ లిమిట్‌పై  నిరుద్యోగుల్లో టెన్షన్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్--1లో డీఎస్పీ పోస్టును టార్గెట్‌గా పెట్టుకుని చదువుకుంటున్న అభ్యర్థులు ఏజ్ లిమిట్‌పై టెన్షన్ పడుతున్నారు. గ్రూప్ 1 పరిధిలోకి వచ్చే ఇతర పోస్టులకు ఏజ్ లిమిట్‌పై ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు వర్తించినప్పటికీ.. యూనిఫాం కేటగిరీకి చెందిన డీఎస్పీ పోస్టుకు మాత్రం 28 ఏండ్లు మాత్రమే ఏజ్ లిమిట్ ఉండడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల సడలింపు(33 ఏండ్ల) ఉన్నప్పటికీ.. ఈ సడలింపు కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2011లో చివరిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కాగా.. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత ఏడున్నరేండ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయలేదు. పదేండ్ల తర్వాత విడుదల కాబోయే నోటిఫికేషన్ లో 28 ఏండ్లు ఏజ్ లిమిట్ పెడితే చాలా మంది డీఎస్పీ పోస్టుకు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఇతర పోస్టుల్లాగే డీఎస్పీ పోస్టుకు కూడా ఏజ్ లిమిట్‌ను వర్తింపజేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్ క్యాడర్‌కు హైట్ 165 సెంటిమీటర్లు ఉంటే.. రాష్ట్రంలో డీఎస్పీ పోస్టుకు హైట్ 167.7 సెం.మీటర్లుగా ఉంది. ఈ హైట్ విషయంలోనూ ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని అభ్యర్థులు కోరుతున్నారు.