గాంధీలోనూ టెన్షన్.. టెన్షన్

గాంధీలోనూ టెన్షన్.. టెన్షన్
  • ఆందోళనలో గాయపడిన 13 మందికి గాంధీ ఎమర్జెన్సీలో చికిత్స
  • ఇద్దరు యువకులకు  అత్యవసర సర్జరీ చేసిన డాక్టర్లు
  •  మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్న గాంధీ సూపరింటెండెంట్ రాజారావు
  •  రాకేశ్​ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. స్వగ్రామానికి తరలింపు

సికింద్రాబాద్/ పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​‘అగ్నిపథ్’ ఆందోళనల్లో గాయపడిన వారితో గాంధీ ఆసుపత్రిలోనూ టెన్షన్​ వాతావరణం కొనసాగింది. ఆందోళనకారులను కట్టడి చేయడంలో భాగంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్​జిల్లా డబీర్​పేట్​కు చెందిన దామోదర రాకేశ్(18) ఛాతికి రబ్బరు బుల్లెట్​తాకింది. అతనితోపాటు ఆందోళనల్లో గాయపడిన13 మంది యువకులను గాంధీకి తరలించారు. వారిని ఎమర్జెన్సీ వార్డులో  చేర్చుకొని చికిత్స అందజేశారు. కాగా రాకేశ్​అప్పటికే మృతి చెందినట్లు గాంధీ డాక్టర్లు నిర్ధారించారు. మిగిలిన వారిలో వికారాబాద్​జిల్లా గుండ్రెటిపల్లికి చెందిన దండు మహేశ్(22)కు వెన్నుపూస భాగంలో తీవ్ర గాయం అయింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు నాగేందర్​బాబు(20)కి ఛాతీ, కాలుకు గాయాలయ్యాయి. ఈ ఇద్దరికి డాక్టర్లు అత్యవసర సర్జరీ చేశారు. గాయాలైన మిగిలిన11 మందికి చికిత్స కొనసాగుతోందని, వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. నార్త్​జోన్​ డీసీపీ చందనా దీప్తి గాంధీ ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించారు. డీఎంఈ కె.రమేశ్ రెడ్డి కూడా గాంధీకి చేరుకొని వైద్య సేవలపై ఆరా తీశారు. గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి, అంబులెన్స్​ల్లో వచ్చే అత్యవసర పేషంట్లను తప్ప మిగితా ఎవరినీ గాంధీలోనికి అనుమతించలేదు. మెయిన్​గేట్ వద్ద బారికేడ్లను 
అడ్డంగా పెట్టారు.
 

మెరుగైన చికిత్స అందించాలి: మంత్రి హరీశ్
సికింద్రాబాద్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌లో ‘అగ్నిపథ్‌‌‌‌’కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి గాయపడిన13 మంది యువకులకు మెరుగైన చికిత్స అందించాలని ఆరోగ్య మంత్రి హరీశ్‌‌‌‌రావు గాంధీ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌‌‌‌ చేశారు. గాంధీకి వెళ్లిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​, కాంగ్రెస్​ నేత వీహెచ్​ గాయపడిన వారిని పరామర్శించారు.

గాయపడిన వారు వీరే.. 
రంగస్వామి(20) (మంత్రాలయం కర్నూల్ జిల్లా), రాకేశ్(20) (చింతకుంట, కరీంనగర్ జిల్లా), శ్రీకాంత్ (20) (పాలకొండ, మహబూబ్ నగర్), కుమార్(21) (వరంగల్), పరు శురాం(22) (నిజాంసాగర్ కామారెడ్డి), మోహన్(20) (నిజాంసాగర్, కామా రెడ్డి), నాగేందర్ బాబు(21) (ఖమ్మం), వినయ్(20) (మహబూబ్ నగర్), విద్యా సాగర్(20) (ఆసిఫాబాద్), లక్ష్మణ్ రెడ్డి (20) (మిర్యాలగూడ), నల్గొండ, మహేశ (21) (కుల్కచర్ల, వికారాబాద్), భరత్ కుమార్ గాంధీలో చికిత్స పొందుతున్నారు.