నాగార్జున సాగర్పై హై డ్రామా .. ఎన్నికల రోజే డ్యాంపైకి వచ్చిన ఏపీ పోలీసులు

నాగార్జున సాగర్పై హై డ్రామా .. ఎన్నికల రోజే డ్యాంపైకి వచ్చిన ఏపీ పోలీసులు

 

  • ప్రాజెక్టుపై ముళ్ల కంచెలు, నీటి విడుదల కోసం పట్టు
  • సెంటి మెంట్ రగిల్చే కుట్ర: రేవంత్ రెడ్డి
  •  ప్రజలను రెచ్చగొట్టేందుకే : నారాయణ

హైదరాబాద్/ హాలియా: ఎన్నికల రోజు నాగార్జున సాగర్ పై హైడ్రామా చోటు చేసుకుంది. తాగు అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉండగా తెలంగాణ తాత్సారం చేస్తోందంటూ 700 మంది ఏపీ పోలీసులు డ్యాంపైకి వచ్చారు. 13వ నంబర్ గేటు వద్ ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి నీటిని విడుదల చేసుకున్నారు. దీనిపై  పీసీసీ చీఫ్ రేవంత్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఓటమి భయంతోనే కేసీఆర్, జగన్ కలిసి ఈ నాటకానికి తెరలేపారని ఆరోపించారు. 

ఏ జరిగిందంటే..? 

నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి డ్యామ్‌పై ముళ్లకంచె ఏర్పాటు చేయడం గొడవకు కారణమైంది. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ 700 మంది పోలీసులతో కలిసి వచ్చిన ఏపీ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు అడ్డుకున్న డ్యామ్ సిబ్బందిపై దాడిచేశారు. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్ వరకు ముళ్లకంచె ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌ వద్దకు చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని సూచించారు. అయితే, వారు స్పందించకపోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది.

నిలిచిన రాకపోకలు

రెండు రాష్ట్రాలకు చెందిన వందల సంఖ్యలో పోలీసులు సాగర్ డ్యాంపై మోహరించారు. ఏపీ అధికారులు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చెయ్యడానికి ప్రయత్నించారు. దీన్ని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. నాటకీయ  పరిణామాల మధ్య ఉదయం 11 గంటలకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేసుకున్నారు.