అట్టుడికిన ఓరుగల్లు.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య దాడులు

అట్టుడికిన ఓరుగల్లు.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య దాడులు
  • రామమందిరం కోసం దొంగ బుక్కులతోబీజేపీ చందాలు వసూలు చేస్తోందని ఆరోపణ
  • భగ్గుమన్న బీజేపీ కార్యకర్తలు..ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన, దాడి
  • చల్లా వ్యాఖ్యలు టీఆర్‍ఎస్‍ మాటేనన్న కడియం
  • బీజేపీ ఆఫీసుపై టీఆర్​ఎస్​ కార్యకర్తల దాడులు

వరంగల్​/వరంగల్‍ రూరల్‍, వెలుగు: అయోధ్య రామ మందిరం అంశంపై టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన కామెంట్లతో ఓరుగల్లు అట్టుడికింది. బీజేపీ, టీఆర్‍ఎస్‍ మధ్య దాడులు, ప్రతిదాడులతో హై టెన్షన్​ నెలకొంది. ప్రెస్‍మీట్లు, నిరసనలు, నినాదాలు.. కోడిగుడ్లు, రాళ్లతో అటాక్‍లు.. పోలీసుల బందోబస్త్​.. అరెస్టులు.. పెద్ద లీడర్ల పరామర్శలు.. వార్నింగులతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వరంగల్‍ సిటీ గరంగరం అయింది.

చల్లా కాంట్రవర్సీ ప్రెస్‍మీట్‍

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అయోధ్య రామమందిర నిర్మాణ చందాలపై వారం కింద వివాదాస్పద కామెంట్లు చేశారు. దీంతో బీజేపీ, హిందూ సంఘాల నేతలు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదివారం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‍తో కలిసి హన్మకొండలో  ప్రెస్‍మీట్‍ పెట్టారు. చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘రామాలయ నిర్మాణం పేరుతో బీజేపీ వేలకోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. అయోధ్యలో కట్టే గుడికి రూ. 1,100 కోట్లు అవసరమవుతాయని ప్రధాని మోడీ అంటే.. రూ. 29 వేల కోట్లు వసూలు చేస్తున్నరు. ఒక్క తెలంగాణలోనే రూ. 1,000 కోట్ల చందాలు వస్తున్నయ్.. దేశంలో, రాష్ట్రంలో ఇప్పటి వరకు వసూలు చేసిన డబ్బులెన్ని? అవి ఎక్కడికి పోతున్నయ్? రోజుకు ఎన్నికోట్లు జమైతున్నయో లెక్కలు చెప్పాలి.. లేదంటే పోరాటమే” అని కామెంట్లు చేశారు.

‘‘శ్రీరామచంద్రుడు అందరివాడు. నేను రామభక్తుడ్నే. ఎన్నో గుళ్లు, గోపురాల నిర్మాణాలకు సహాయ సహకారాలు అందించిన. భద్రాద్రి భూములను ఏపీకి ఇచ్చిన బీజేపీ మాత్రం శ్రీరాముడి పేరుతో రాజకీయం చేస్తోంది. దొంగ బుక్కులు, అకౌంటబిలిటీ లేని బుక్కులను కొట్టుకుని ఊరురూ, వాడవాడ తిరుగుతోంది. ఇండ్లమీద పడి బీజేపోళ్లు ఇష్టారీతినా వసూలు చేస్తున్నరు. ఇదే విషయాన్ని నేను అడిగా..  ఇప్పుడు కూడా అడుగుతున్నా” అని అన్నారు. ‘‘రూ. 2,900 కోట్లతో సర్ధార్‍ వల్లభాయ్‍ పటేల్‍ విగ్రహం పెట్టారు.  శ్రీరాముడు మావాడే అన్నట్లు మాట్లాడే బీజేపోళ్లకు అయోధ్య రామమందిర నిర్మాణం కోసం రూ. 1,100 కోట్లు ఖర్చు చేయలేరా?’’ అంటూ  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు.

చల్లా ఇంటి ముందు బీజేపీ నిరసన, దాడి

రామమందిరం విషయంలో బీజేపీపై చల్లా ధర్మారెడ్డి చేసిన కామెంట్లపై బీజేపీ కేడర్​ భగ్గుమంది. హన్మకొండ అదాలద్‍లోని ఎమ్మెల్యే ఇంటిముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‍ చేసింది. చల్లా వ్యాఖ్యలను బీజేపీ అర్బన్‍, రూరల్‍ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్‍  ఖండించారు. రామమందిర నిర్మాణం కోసం తీసుకునే చందాల విషయంలో ప్రతి పైసాకు లెక్క ఉంటుందనే విషయం తెలియని అసమర్థ ఎమ్మెల్యే అంటూ మండిపడ్డారు. కొందరు కార్యకర్తలు చల్లా ఇంటిపై కోడిగుడ్లు, టమాటలు, అక్కడే ఉన్న రాళ్లను విసిరారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు పగిలాయి. పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు బీజేపీ కేడర్‍ను అరెస్ట్​ చేసి స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో ఓ గంట పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది.

టీఆర్‍ఎస్‍ లీడర్ల సీరియస్‍ వార్నింగ్‍

చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న టీఆర్‍ఎస్‍  లీడర్లు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు.  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, గ్రేటర్‍ మేయర్‍ గుండా ప్రకాశ్‍రావు.. చల్లా ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు. వరంగల్‍ సీపీ ప్రమోద్‍కుమార్‍తో మాట్లాడారు. అనంతరం అక్కడే ప్రెస్‍మీట్‍ పెట్టి బీజేపీ లీడర్లకు ‘ఖబడ్దార్‍’ అంటూ సీరియస్‍ వార్నింగ్‍ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్‍రావు మాట్లాడుతూ.. తాము ఒక్క పిలుపిస్తే బీజేపోళ్లను ఉరికిచ్చి కొడతరని హెచ్చరించారు. బుక్కుల లెక్కలడిగితే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ లీడర్లు ఊరకుక్కుల్లా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. స్టేట్‍, జిల్లా లీడర్లను జాతీయ లీడర్లు కంట్రోల్లో పెట్టాలని.. లేకుంటే తమకు ఏం చేయాలో తెలుసన్నారు. గ్రేటర్‍ వరంగల్​ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే బీజేపీ గొడవలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అయోధ్య రామమందిర్‍ చందాలను తాము మాత్రమే వసూలు చేస్తామని, రాజకీయ పార్టీలకు సంబంధంలేదని విశ్వహిందూ పరిషత్‍ తెలిపిందన్నారు. ఆదివారం ఘటనల్లో పోలీసుల ఫెయిల్యూర్​ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. చల్లా వ్యాఖ్యలను టీఆర్‍ఎస్‍ పార్టీ మాటగా తీసుకోవాలన్నారు.

టీఆర్​ఎస్​ నాయకులను అరెస్టు చేయాలి: బీజేపీ

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఇంటిపైన దాడికి పాల్పడ్డారనే కారణంతో బీజేపీ నాయకులను అరెస్టు చేసి, బీజేపీ ఆఫీస్​ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడం పట్ల బీజేపీ నేతలు ఆదివారం రాత్రి ఆందోళనకు చేపట్టారు. సుబేదారి పోలీస్​ స్టేషన్​ ఎదుట బైఠాయించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఆఫీస్​పై దాడికి పాల్పడిన టీఆర్​ఎస్​ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

బీజేపీ ఆఫీస్​,వెహికల్స్పై  టీఆర్ఎస్ దాడి

బీజేపీ మాదిరిగా టీఆర్​ఎస్​ దాడులు చేయదని, ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని ఓ వైపు మంత్రి ఎర్రబెల్లి ఇతర లీడర్లు ప్రెస్‍మీట్​లో మాట్లాడుతుండగా..   సరిగ్గా అదే టైంలోనే టీఆర్‍ఎస్‍ కేడర్‍  వరంగల్​ అర్బన్​ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఇంటిపై, బీజేపీ ఆఫీస్‍పై దాడి చేశారు. టూ వీలర్స్​ మీద వచ్చి ఆఫీస్ పై రాళ్లు, కోడిగుడ్లు, టమాటలు విసిరారు. దీంతో అక్కడున్న ఆర్చీ కూలిపోవడంతో పాటు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అప్పటికే పార్టీ ఆఫీస్​ దగ్గరకు చేరుకున్నా టీఆర్​ఎస్​ కార్యకర్తలను మాత్రం చూసీచూడనట్లు వదిలేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇదిలాఉంటే ఎమ్మెల్యే ఇంటి వద్ద అరెస్టు చేసిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి స్టేషన్​కు తీసుకొచ్చారు. వారిని స్టేషన్​లో నిర్బంధించగా.. టీఆర్​ఎస్​ కార్యకర్తలు కొందరు బీజేపీ నేతల వెహికల్స్​పై రాళ్లతో దాడి చేశారు. నంబర్​ ప్లేట్​ లేని టూ వీలర్స్​ మీద వచ్చి దాడికి ప్రయత్నించడంతో బీజేపీ లీడర్లు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ఓ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమ పార్టీ ఆఫీస్ పై టీఆర్​ఎస్​ కార్యకర్తల దాడిని ఖండిస్తూ బీజేపీ అర్బన్​ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నిరసన దీక్ష చేపట్టారు.