బాసర ట్రిపుల్​ఐటీ వద్ద ఉద్రిక్తత.. నిరసనకు దిగిన టీజేఎస్​, కాంగ్రెస్​

బాసర ట్రిపుల్​ఐటీ వద్ద ఉద్రిక్తత.. నిరసనకు దిగిన టీజేఎస్​, కాంగ్రెస్​
  • అరెస్టు చేసి పీఎస్​కు తరలించిన పోలీసులు 
  • భారీగా మోహరింపు  

భైంసా/బాసర, వెలుగు : నిర్మల్​జిల్లా బాసర ట్రిపుల్​ఐటీ కాలేజీ పోలీసు పహారాలో ఉంది. రెండు రోజుల కింద పీయూసీ-1 చదువుతున్న జాదవ్ ​బబ్లూ  ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బుధవారం క్యాంపస్​దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనను నిరసిస్తూ టీజేఎస్​ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్​ వినోద్​ కుమార్ ​ఆధ్వర్యంలో యూనివర్సిటీని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా వినోద్​కుమార్ ​మాట్లాడుతూ బాసర ట్రిపుల్​ ఐటీ ఆత్మహత్యలకు కేరాఫ్​గా మారిందన్నారు. ఏడాదిలో ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్​సర్కారు స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్​హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

తర్వాత కాంగ్రెస్​ ముథోల్​నియోజకవర్గ ఇన్​చార్జి ఆనంద్​రావు పటేల్​, లీడర్లు సైతం క్యాంపస్​లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. వారిని కూడా అరెస్టు చేసి పీఎస్​కు తీసుకువెళ్లారు. ఆర్జీయూకేటీ మెయిన్​గేటు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.  సజెషన్స్​ బాక్సులు ఏర్పాటు చేస్తాం కాలేజీలో స్టూడెంట్స్​ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని వీసీ వెంకట రమణ తెలిపారు. మంగళవారం జాదవ్​ బబ్లూ అనే స్టూడెంట్​ఆత్మహత్య చేసుకోగా, బుధవారంశ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బబ్లూ కుటుంబానికి రూ. 2లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. వారం క్రితమే క్యాంపస్​కు కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఓరియంటేషన్​నిర్వహించామని గుర్తు చేశారు. విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు సజెషన్స్​బ్యాక్సులు, మెయిన్​ గేటు దగ్గర పేరెంట్స్​ కోసం లాంజ్​ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.