టెన్త్​ పేపర్​ లీక్​ కాలేదు.. స్టూడెంట్స్​ ఆందోళన చెందొద్దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

టెన్త్​ పేపర్​ లీక్​ కాలేదు.. స్టూడెంట్స్​ ఆందోళన చెందొద్దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  •     సెల్​ఫోన్లు, ఎలక్ట్రానిక్ ​డివైజ్​లను అనుమతించొద్దు
  •     కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్​

హైదరాబాద్, వెలుగు: టెన్త్​ హిందీ పేపర్​ లీక్​ కాలేదని, స్టూడెంట్స్​ ఆందోళన చెందొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను.. జాబ్​ల నుంచి శాశ్వతంగా తీసేస్తామన్నారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్​తో ఆడుకోవద్దన్నారు. మిగిలిన పరీక్షల విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. పరీక్షల నిర్వహణలో 55 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్​ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించొద్దని సూచించారు. పరీక్ష పేపర్ల రవాణా విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలన్నారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాపులను మూసివేయించాలన్నారు. ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించిన అధికారులను అభినందించారు.