ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
  • విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం వరకు పరీక్షలకే కట్టుబడి ఉంటామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలతో మెట్టు దిగింది. కొద్దిసేపటి క్రితం అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జులై 31లోపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించే పరిస్థితి లేకపోవడంతో పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 
పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం సాధ్యం కాదని.. ఎందుకంటే పరీక్షల నిర్వహణకు.. ఆ తర్వాత జవాబు పత్రాలు దిద్దటానికి 45 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ ప్రకారం సాధ్యం కాకపోవడంతో పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. 
మార్కులపై త్వరలో నిర్ణయం
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసినందున ఏ పద్ధతి ప్రకారం మార్కులు ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని నియమిస్తామని.. కమిటీ సిఫారసుల ఆధారంగా విధి విధానాలు రూపొందిస్తామని ఆయన తెలిపారు.  పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలా ప్రయత్నించామో ఫలితాల కోసం కూడా ప్రభుత్వం నుంచి నిర్ణయ లోపం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే ఒక్క విద్యార్థి చనిపోయినా ఉపేక్షించేదిలేదని.. ఒక్కో విద్యార్థికి రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశాలిస్తామన్న సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సి వచ్చింది. పరీక్షలకే కట్టుబడి ఉన్నా.. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా ఏర్పాట్ల వివరాలేవీ లేకపోవడం.. రేపు శుక్రవారం ఉదయంలోగా అఫిడవిట్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర  ప్రభుత్వానికి పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితి సృష్టించింది. 

సీఎం జగన్ జోక్యంతోనే మంత్రి ప్రకటన

ఇంటర్‌ పరీక్షలపై సీఎం జగన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీజరిగింది. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపధ్యంలో ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలపై ఏం చేద్దామంటూ అధికారులతో చర్చించిన ఆయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ కు కబురు చేశారు. వెంటనే తన కార్యాలయానికి రమ్మని పిలిపించారు. సీఎం పిలుపుతో విజయవాడకు చేరుకున్న మంత్రి సురేష్‌ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించారు. పరిస్థితిని అప్పటికే ఉన్నతాధికారులు  సీఎంకు వివరించగా వాటిని విద్యాశాఖ మంత్రికి తెలియజేశారు. దీంతో మంత్రి సురేష్ హడావుడిగా మీడియా సమావేశం పెట్టి ఇంటర్, టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి కార్యాచరణ కోసం హైపర్ కమిటీ ఏర్పాటు చేయనున్నామని, విద్యార్ధులు నష్ట పోకూడ చర్యలు తీసుకుంటామని మంత్రి అదిములపు సురేష్ వివరించారు.