ఇంట్లో తండ్రి డెడ్‌‌బాడీ.. చేతిలో టెన్త్‌‌ హాల్‌‌టికెట్‌‌ .. బాధతోనే ఎగ్జామ్‌‌కు

ఇంట్లో తండ్రి డెడ్‌‌బాడీ.. చేతిలో టెన్త్‌‌ హాల్‌‌టికెట్‌‌ ..  బాధతోనే ఎగ్జామ్‌‌కు

నస్రుల్లాబాద్‌‌, వెలుగు :  ఇంట్లో తండ్రి డెడ్‌‌బాడీ... తమ చేతిలో భవిష్యత్‌‌ను నిర్ణయించే టెన్త్‌‌ హాల్‌‌టికెట్‌‌ ఉండడంతో ఏం చేయాలో తెలియక ఆ స్టూడెంట్లు సతమతమయ్యారు. చివరికి తమ తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఎగ్జామ్‌‌ రాసేందుకే నిర్ణయించుకొని, తండ్రి చనిపోయాడన్న బాధను పంటి బిగువున భరిస్తూనే ఎగ్జామ్‌‌ పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌‌ మండల కేంద్రానికి చెందిన దండు శ్రీనివాస్‌‌ అనే శానిటేషన్‌‌ వర్కర్‌‌ ఆదివారం చనిపోయాడు. తన కూతురు స్రవంతికి సోమవారం ఉదయం టెన్త్‌‌ ఎగ్జామ్‌‌ ఉండడంతో రాత్రి పెన్నులు, ఇతర సామగ్రి అందజేసి ఎగ్జామ్స్‌‌ బాగా రాయాలని సూచించాడు. తెల్లవారేసరికి గుండెపోటుతో చనిపోయాడు. అయినప్పటికీ తండ్రి చనిపోయాడన్న బాధతోనే స్రవంతి ఎగ్జామ్‌‌ సెంటర్‌‌కు వెళ్లి పరీక్ష పూర్తి చేసి వచ్చింది. 

ఎగ్జామ్‌‌ పూర్తి చేశాక తండ్రికి అంత్యక్రియలు

ఎల్లారెడ్డిపేట/కల్లూరు, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన పుట్టి రవి (45) ట్రాక్టర్ డ్రైవర్‌‌గా  పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో శనివారం హాస్పిటల్‌‌లో చేరగా ఆదివారం రాత్రి చనిపోయాడు. రవి కుమారుడు శ్రావణ్ అక్కపల్లిలోని చిన్నమ్మ ఇంట్లో ఉంటూ టెన్త్‌‌ చదువుతున్నాడు. ఎలాగైనా ఎగ్జామ్‌‌ రాయాలని బంధువులు శ్రావణ్‌‌కు సూచించడంతో ఎల్లారెడ్డిపేటలోని జడ్పీహెచ్‌‌ఎస్‌‌లో ఎగ్జామ్‌‌కు హాజరయ్యారు. అనంతరం తన స్వగ్రామంలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన మారబోయిన గోపయ్య (52) కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. అతడి కొడుకు అఖిల్‌‌ టెన్త్‌‌ చదువుతున్నాడు. సోమవారం ఎగ్జామ్స్‌‌ స్టార్ట్‌‌ కావడంతో తప్పనిపరిస్థితిలో సెంటర్‌‌కు వెళ్లి ఎగ్జామ్‌‌ రాశాడు. అనంతరం తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. 

మంచంపై ఎగ్జామ్‌‌ సెంటర్‌‌కు...

కొల్లాపూర్, వెలుగు :  ఇటీవల యాక్సిడెంట్‌‌లో గాయపడిన ఓ టెన్త్‌‌ స్టూడెంట్‌‌ మంచంపైనే ఎగ్జామ్‌‌కు హాజరయ్యాడు. నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌‌ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన టెన్త్‌‌ స్టూడెంట్‌‌ సాంబశివుడు ఇటీవల సైకిల్‌‌ తొక్కుతూ కిందపడడంతో కాలు విరిగింది. సోమవారం నుంచి ఎగ్జామ్స్‌‌ స్టార్ట్‌‌ కావడంతో అతడిని మంచంపైనే కొల్లాపూర్‌‌లోని సెయింట్‌‌ జోసెఫ్‌‌ సెంటర్‌‌కు తీసుకొచ్చారు. ఆఫీసర్ల నుంచి పర్మిషన్‌‌ తీసుకొని ఎగ్జామ్‌‌ రాశాడు.