గిరిజన గురుకుల స్కూల్లో .. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

 గిరిజన గురుకుల స్కూల్లో ..  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో ఉన్న గిరిజన గురుకుల బాలుర పాఠశాల ఆవరణలో అదే స్కూల్ కు చెందిన ఓ టెన్త్  స్టూడెంట్  గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం నేతాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ధన్ సింగ్ తండాకు చెందిన మెగావత్ సోమ, జయ దంపతులకు ఇద్దరు కొడుకులు. రెండో కొడుకు మారుతి కుమార్ (16) దామరచర్ల లో ఉన్న గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో టెన్త్  చదువుతున్నాడు.

దీపావళి వేడుకలకు ఇంటికి వచ్చి వెళ్లాడు. కాగా, ఈనెల 16న మొదటి  పీరియడ్ అయ్యాక బయటికి వెళ్లిన మారుతి కుమార్.. గడ్డిమందు కొని పాఠశాల ఆవరణలో తాగాడు. అనంతరం తిరిగి క్లాస్ కు వెళ్లాడు. గుర్తించిన స్టాఫ్.. బాలుడి  కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి విద్యార్థిని వెంటనే మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు కుటుంబ సభ్యులు మారుతిని హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 17న అతను చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పేరెంట్స్  ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వాడపల్లి పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై గిరిజన గురుకుల శాఖ ఉన్నతాధికారులు గుట్టుగా విచారిస్తున్నారు. బాలుడి సూసైడ్  విషయమై విచారణకు వచ్చిన అధికారులను వివరణ కోసం సంప్రదించినా స్పందించలేదు.  కాగా, తమకు అర ఎకరం వ్యవసాయ భూమి మాత్రమే ఉందని, చదువులో ముందుండే కుమారుడిని కోల్పోయామని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.