టెర్రరిజాన్ని సహించేది లేదు..

టెర్రరిజాన్ని సహించేది లేదు..
  • అమెరికన్ కాంగ్రెస్​లో ప్రధాని నరేంద్ర మోదీ 
  • టెర్రరిస్ట్​లను ఉసిగొల్పే దేశాలపై 
  • కఠిన చర్యలు తీస్కోవాలని పిలుపు 
  • పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని 
  • గౌరవించాలంటూ చైనాకూ చురక 

వాషింగ్టన్:  టెర్రరిజం మానవత్వానికి శత్రువు అని, దానిని అంతం చేయడంలో ఎలాంటి తటపటాయింపులు ఉండొద్దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇతర దేశాలపైకి టెర్రరిస్ట్ లను ఉసిగొల్పుతున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.  గురువారం అమెరికన్ పార్లమెంట్ (యూఎస్ కాంగ్రెస్)లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘న్యూయార్క్ పై 9/11 టెర్రరిస్ట్ అటాక్ జరిగి రెండు దశాబ్దాలు గడిచాయి. 

ముంబైపై 26/11 టెర్రరిస్ట్ దాడి జరిగి దశాబ్దంపైగా అయింది. కానీ ఇప్పటికీ టెర్రరిజం ప్రపంచానికి పెను ప్రమాదంగానే ఉంది. టెర్రరిజం రూపాలు మార్చుకుంటోంది. కానీ దాని ఉద్దేశం మాత్రం మారణహోమమే. అందుకే టెర్రరిజాన్ని అంతం చేయడంతోపాటు దానికి ఊతం ఇస్తున్న దేశాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలి” అని మోదీ పిలుపునిచ్చారు. యూఎస్ కాంగ్రెస్​లో  సుమారు గంట పాటు ఇంగ్లిష్​లో ప్రసంగించారు. అమెరికన్ కాంగ్రెస్​లో తనకు రెండోసారి మాట్లాడే అవకాశం రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. ఇంతకుముందు 2016లో ఆయన యూఎస్ కాంగ్రెస్​లో తొలిసారిగా మాట్లాడారు. కాంగ్రెస్​లో రెండు సార్లు స్పీచ్ ఇచ్చిన తొలి ఇండియన్ లీడర్ గా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. 

ఇండో-పసిఫిక్​లో చీకటి మేఘాలు 

దౌర్జన్యం, ఘర్షణపూరిత వాతావరణంతో ఇండో-–పసిఫిక్ ప్రాంతంలో చీకటి మేఘాలు కమ్ముకున్నాయంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి మోదీ ఫైర్ అయ్యారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ నిర్దేశించే సూత్రాలకు కట్టుబడి ఉండటం, వివాదాలను చర్చలతోనే పరిష్కరించుకోవడం, ఇతర దేశాల సార్వభౌమత్వం, భూభాగ సమగ్రతను గౌరవించడం మీదే ప్రపంచ శాంతి ఆధారపడి ఉందంటూ తరచూ మిలిటరీ మోహరింపులతో ఉద్రిక్తతలు పెంచుతున్న చైనా తీరును ఆయన తప్పుపట్టారు. ఇండో–పసిఫిక్ లో స్థిరత్వం, శాంతి కోసం అమెరికా, ఇండియా కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. శ్రీలంక, పాక్ వంటి చిన్న దేశాలను అభివృద్ధి పేరుతో అప్పుల ఊబిలోకి నెట్టుతూ చైనా తన పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. 

ఇండియన్ల పాత్ర కీలకం..

అమెరికా, ఇండియా సంబంధాలు బలోపేతం కావడం వెనక ఇండియన్ అమెరికన్ల కృషి ఎంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. కేవలం స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ లోనే కాదు.. రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లోనూ సహకారం పెరగడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.  
టెర్రరిజంపై కలిసికట్టుగా పోరాడ్తం టెర్రరిజంపై కలిసికట్టుగా పోరాడతామని అమెరికా, ఇండియా స్పష్టం చేశాయి. ప్రధాని మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ భేటీ తర్వాత రెండు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 

వైట్​హౌస్​లో మోదీకి విందు

వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన అధికారిక స్టేట్ డిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రపంచ వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ హోస్ట్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించిన ఈ విందులో గూగుల్ సీఈవో సుందర్ పిచయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, వ్యాపారవేత్త ఆనంద్‌‌‌‌‌‌‌‌ మహీంద్రా, కార్పొరేట్ లీడర్ ఇందిరా నూయి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ సహా మొత్తం 400 మంది అతిథులు పాల్గొన్నారు. ప్రధాని శాకాహారి కావడంతో వెజిటేరియన్ వంటలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. మోదీ మాట్లాడుతూ.. తాము నివసిస్తున్న దేశం అభివృద్ధిలో ఇండియన్ అమెరికన్ల పాత్రను ప్రశంసించారు. 

చప్పట్లతో దద్దరిల్లిన సభ

మోదీ ప్రసంగంపై అమెరికన్ చట్టసభ సభ్యులు ప్రశంసలు కురిపించారు. రెండు దేశాల స్నేహ బంధాన్ని ఆయన స్పీచ్ చాటిచెప్పిందని సెనేట్ ఇండియా కాకస్ కో చైర్మన్ మార్క్ వార్నర్ అన్నారు. డిఫెన్స్, ట్రేడ్, టెక్నాలజీ రంగాల్లో మరింత సహకారం కోసం మోదీ, బైడెన్ నిర్ణయాలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మోదీ అమెరికాకు ముఖ్యమైన మిత్రుడని ప్రతినిధుల సభ సభ్యుడు ఫ్రెంచ్ హిల్ అన్నారు. మోదీ స్పీచ్ సాగుతుండగా 15 సార్లు చట్టసభల సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. విజిటర్ గ్యాలరీలో కూర్చుకున్న ఇండియన్ అమెరికన్ లు ‘మోదీ.. మోదీ, భారత్ మాతా కీ జై’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.  

నలుగురు సభ్యుల బాయ్ కాట్ 

ప్రధాని మోదీ పాల్గొన్న యూఎస్ కాంగ్రెస్ జాయింట్ మీటింగ్ ను ప్రతినిధుల సభ సభ్యులు రషీదా తలైబ్, కోరి బుష్, ఇల్హాన్ ఒమర్, జమాల్ బౌమాన్ బాయ్ కాట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలు, జర్నలిస్టులపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. మోదీ, ఆయన పాలసీలతో కొన్ని కమ్యూనిటీలకు హాని కలిగిందని, ఆ వర్గాలకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పారు.  

ఇండియాలో ఎలాంటి వివక్ష లేదు జర్నలిస్టుల ప్రశ్నలకు మోదీ జవాబు

వాషింగ్టన్:  ఇండియాలో భావప్రకటన స్వేచ్ఛపై ఎలాంటి ఆంక్షలు లేవని, మైనార్టీలపై ఎలాంటి వివక్ష లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యమే ఇండియా శ్వాస అని, దేశంలో మతం, కులం, జాతి, లింగం వంటి అంశాలపై అధికారికంగా వివక్ష చూపుతున్నామన్న ప్రశ్నే లేదన్నారు. గురువారం వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రతినిధి సబ్రినా సిద్దిఖీ, మరో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం ఇచ్చారు. ఇండియా, అమెరికా డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉందన్నారు. ‘‘మన రక్తంలోనే ప్రజాస్వామ్యం ఉంది. మన నాయకులు రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలను చేర్చారు. మనవి ప్రజాస్వామ్య దేశాలు అని మీరు అంగీకరిస్తే.. వివక్ష అన్న ప్రశ్నే ఉండదు” అని ఆయన చెప్పారు.

ఏఐ అంటే.. అమెరికా, ఇండియా 

‘‘గత కొన్నేండ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఎన్నో డెవలప్​మెంట్స్ వచ్చాయి. అదేటైంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా రిలేషన్స్) లోనూ చాలా డెవలప్మెంట్స్ జరిగాయి” అని మోదీ చమత్కరించా రు. ఈ శతాబ్దం మొదలైనప్పుడు రెండు దేశాల మధ్య రక్షణ సహకారం లేదని, ఇప్పుడు మాత్రం అమెరికా, ఇండియా రక్షణ రంగంలో అత్యంత ముఖ్యమైన భాగస్వాములుగా మారాయన్నారు. సమానత్వం, హుందాతనానికి ప్రజాస్వామ్యమే మద్దతునిస్తుందన్నారు. చరిత్రలో ఎన్నో ఏండ్లుగా ప్రజాస్వామ్య విలువలు పెంపొందుతూ వచ్చాయని, ఇండియా ‘మదర్ ఆఫ్​ డెమోక్రసీ’గా నిలిచిందన్నారు. అంతరిక్ష రంగంలో నాసా, ఇస్రో సహకారం కోసం ఆర్టెమిస్ ఒప్పందాల్లో చేరడం, 2024లో రెండు దేశాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు జాయింట్ మిషన్ చేపట్టనుండటం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

టెర్రరిజం మానవత్వానికి శత్రువని, దానిని ఉపేక్షించొద్దని  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇతర దేశాలపైకి టెర్రరిస్టులను ఉసిగొల్పుతున్న దేశాలతో కఠినంగా ఉండాలన్నారు. గురువారం అమెరికన్ పార్లమెంట్ (యూఎస్ కాంగ్రెస్)లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. సుమారు 60 నిమిషాల పాటు ఆయన  ప్రసంగించారు. దౌర్జన్యం, ఘర్షణపూరిత వాతావరణంతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చీకటి మేఘాలు కమ్ముకున్నాయంటూ చైనాను ఉద్దేశించి మోదీ ఫైర్ అయ్యారు. శ్రీలంక, పాక్ వంటి చిన్న దేశాలను అభివృద్ధి పేరుతో అప్పుల ఊబిలోకి నెట్టుతూ చైనా తన పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. మోదీ స్పీచ్ సాగుతుండగా ఏకంగా 15 సార్లు చట్టసభల సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. వైట్​ హౌస్​లో ప్రధాని మోదీకి ఇచ్చిన అధికారిక స్టేట్​ డిన్నర్​కు ప్రపంచ వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు.టెర్రరిజాన్ని సహించేది లేదు