ఆత్మాహుతి దాడి అంటే టెర్రరిజమే ..ఇస్లాం ప్రకారం ఆత్మహత్య నిషేధం

ఆత్మాహుతి దాడి అంటే టెర్రరిజమే ..ఇస్లాం ప్రకారం ఆత్మహత్య నిషేధం
  • అమాయకులను చంపడం ఘోరమైన పాపం
  • ఎంఐఎం చీఫ్‌‌‌‌ అసదుద్దీన్  ఒవైసీ ట్వీట్

హైదరాబాద్‌‌‌‌: ఆత్మాహుతి దాడి అంటే ముమ్మాటికీ టెర్రరిజమేనని మజ్లిస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ తేల్చిచెప్పారు. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో టెర్రరిస్టులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన సూసైడ్ బాంబర్  డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఉమర్‌‌‌‌‌‌‌‌ ఉన్‌‌‌‌ నబీ పాత వీడియో ఒకటి మంగళవారం బయటపడింది. ఆత్మాహుతి దాడి అంటే ఇస్లాంలో బలిదాన ఆపరేషన్‌‌‌‌ అంటూ ఉమర్ అందులో పేర్కొన్నాడు. ఆ వీడియోను ఉద్దేశించి అసద్‌‌‌‌ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 

ఆత్మాహుతి దాడిని బలిదానం అనడం తప్పు, ఇస్లాంలో ఆత్మహత్యకు పాల్పడడం నిషేధం అని వివరించారు. అమాయకులను చంపడం అత్యంత ఘోరమైన పాపమని తెలిపారు. దేశ చట్టాలకు, దేశానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడటం టెర్రరిజమే తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షాపైనా అసద్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత ఆరు నెలల్లో ఒక్క కాశ్మీరీ కూడా టెర్రరిస్ట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌లో చేరలేదని ప్రకటించిన అమిత్‌‌‌‌షా.. ఢిల్లీలో బ్లాసింగ్‌‌‌‌కు పాల్పడిన గ్రూప్‌‌‌‌ను ముందుగానే ఎందుకు కనిపెట్టలేదని ప్రశ్నించారు. ఈ గ్రూప్‌‌‌‌ను గుర్తించకపోవడంలో బాధ్యత ఎవరిదని నిలదీశారు.