మళ్లీ యాక్టివ్ అయిన టెర్రరిస్ట్​ గ్రూపులు

మళ్లీ యాక్టివ్ అయిన టెర్రరిస్ట్​ గ్రూపులు
  • ఉత్తర తెలంగాణలో ఉగ్రజాడలు
  • మళ్లీ యాక్టివ్ అయిన టెర్రరిస్ట్​ గ్రూపులు
  • కీలక డాక్యుమెంట్లు, హార్డ్​డిస్క్​లు సీజ్​
  • సమాచారాన్ని విశ్లేషిస్తున్న ఎన్ఐఏ


నిర్మల్, వెలుగు: ఉత్తర తెలంగాణలో ఉగ్రవాద సంస్థలు మళ్లీ కార్యకలాపాలను మొదలు పెట్టడం కలకలం రేపింది. నిజామాబాద్​, జగిత్యాల, కరీంనగర్​, భైంసాల్లో నేషనల్​ ఇన్వేస్టిగేషన్ ఏజన్సీ (ఎన్​ఐఏ) నిర్వహించిన సోదాల్లో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం.  పాపులర్​ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా (పీఎఫ్​ఐ)  కరాటే శిక్షణ పేరిట యూత్ ను ఆకర్శించి వారికి ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఎన్​ఐఏ గుర్తించింది. గతంలోనూ పాకిస్తాన్​కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలపాలను నిర్వహించాయి. మళ్లీ కొంత కాలంగా అవి  యాక్టివ్​ అయ్యాయి. 

నిజామాబాద్​, ఆర్మూర్​లలో కొద్దిరోజుల కింద పీఎఫ్​ఐ కార్యకలపాలను గుర్తించిన  ఎన్ఐఏ ఆఫీసర్లు రెండు రోజుల కింద  ఏకకాలంలో చాలా చోట్ల దాడులు చేశారు. నిజామాబాద్​లో 23 చోట్ల, జగిత్యాలలో 7, భైంసాలో 2 చోట్ల, ఆదిలాబాద్​, కరీంనగర్​లలో ఒక్కో చోట  దాడులు చేసి  పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కీలక డాక్యుమెంట్లు, హార్డ్​ డిస్క్​లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఎన్​ఐఏ  సేకరించింది. నిజామాబాద్ కేంద్రంగా పలు ప్రాంతాలకు ఉగ్ర కార్యకలపాలు విస్తరించనున్నట్టు గుర్తించారని తెలుస్తోంది. ఎన్​ఐఏ సీజ్​ చేసిన డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలిస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.  మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని పట్టణాల మీద ఈ సంస్థలు ఫోకస్​ చేసినట్టు భావిస్తున్నారు. నిజామాబాద్​, భైంసా, ఆదిలాబాద్​లతోపాటు  మహారాష్ట్రలోని ధర్మా బాద్, భోకర్, నాందేడ్, ఔరంగాబాద్, హిమాయత్​నగర్​, ఇస్లాపూర్ లో ఈసంస్థ యూత్​ను రిక్రూట్​మెంట్​ చేయనుందని అనుమానిస్తున్నారు.  

ముంబై పేలుళ్లతో భైంసాకు లింక్​ 

కార్యకలాపాలతో ఈ ప్రాంతానికి చాలాకాలం నుంచి సంబంధాలున్నాయి.  ముంబై బాంబు పేలుళ్ల కేసులో  ప్రమేయం ఉన్న  భైంసాకు చెందిన ఓ వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష పడింది. ఈ వ్యక్తి ముంబై పేలుళ్లతోపాటుఅంతకు ముందు కూడా  టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు.   మహారాష్ట్రలోని ధర్మాబాదుకు చెందిన ఆజాం ఘోరీ అనే ఐఎస్ఐ టెర్రరిస్ట్  భైంసాతో పాటు నాందేడ్, నిజామాబాద్​, జగిత్యాల తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. యువకులను చేరదీసి.. వారికి శిక్షణ ఇచ్చాడు. వారికి  ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరించే  బాధ్యతలను అప్పజెప్పినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల దందాతోనూ అజాం ఘోరీకి సంబంధాలున్నాయనా ఆరోపణలు వచ్చాయి.

2000లో అజాం ఘోరీ జగిత్యాలలో జరిగిన ఎన్ కౌంటర్​లో చనిపోవడంతో అతని నెట్​వర్క్​ దెబ్బతిన్నది. 2002లో నిజామాబాద్​ దగ్గరున్న సారంగపూర్​లో అన్వర్​ అనే ఐఎస్​ఐ టెర్రరిస్ట్​ అరెస్టయ్యాడు. ఆతర్వాత కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న పలువురు పోలీసులకు చిక్కారు.  తిరిగి ఇప్పుడు   పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరిట  కార్యకలాపాలు మొదలయ్యాయి. యూత్​ను ఆకర్శించి ఆవేశ పూరిత ప్రసంగాలతో వారికి  విద్వేషాన్ని నూరిపోయడం ద్వారా నెట్ వర్క్​ విస్తరిస్తున్నారు. చాలాపట్టణాల్లో పని చేస్తున్న పీఎఫ్ ఐ  యూత్​తోపాటు చిరువ్యాపారులను టార్గెట్​ చేసిందని అనుమానిస్తున్న అధికారులు.. ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.