గద్వాల సర్కార్ దవాఖానలో టెస్టులు చేస్తలేరు!

గద్వాల సర్కార్ దవాఖానలో టెస్టులు చేస్తలేరు!
  •     మెషీన్లు చెడిపోవడంతో పేషెంట్లకు తప్పని తిప్పలు
  •     స్కానింగ్  మెషీన్​ ఉన్నా  రేడియాలజిస్టు లేక అవస్థలు
  •     రెండు రోజుల తరువాత ఎక్స్ రే ఇస్తున్రు
  •     ప్రైవేట్​ ల్యాబ్​లను ఆశ్రయిస్తున్న పేషెంట్లు

గద్వాల, వెలుగు : సర్కార్ దవాఖానల్లో 150 టెస్టులు ఫ్రీగా చేస్తామని సర్కారు చెబుతున్నా, గద్వాల దవాఖానలో మాత్రం స్కానింగ్, అల్ట్రా సౌండ్  స్కానింగ్, టిఫా స్కానింగ్ తో పాటు 2డీ ఎకో టెస్టులు చేయడం లేదని పేషెంట్లు వాపోతున్నారు. హాస్పిటల్​లో మెషీన్లు చెడిపోవడంతో అన్ని టెస్టులకు పేషంట్లను బయటకే పంపిస్తున్నారు. పేషంట్ల అవసరాన్ని బట్టి ప్రైవేట్​ ల్యాబ్​లలో అందిన కాడికి దోచుకుంటున్నారు. స్కానింగ్  చేసే మెషీన్  ఉన్నప్పటికీ, రేడియాలజిస్టు లేకపోవడంతో బయటి ల్యాబ్ లకే పంపిస్తున్నారు.

సీబీపీ(కంప్లీట్  బ్లడ్  పిక్చర్) చేసే మెషీన్​ చెడిపోవడంతో గత 15 రోజుల నుంచి టెస్టుల కోసం బయటికే పంపిస్తున్నారు. ఇదిలాఉంటే హాస్పిటల్​లో పని చేసే కొందరికి ల్యాబ్ లు ఉండడం, అక్కడికే టెస్టుల కోసం పంపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ల్యాబ్  ఓనర్​ డాక్టర్లు, నర్సులకు కమీషన్  ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మూలనపడ్డ స్కానింగ్  మెషీన్..

టీ హబ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన స్కానింగ్  మెషీన్​ రేడియాలజిస్ట్  లేకపోవడంతో మూలనపడింది. టీ హబ్  సెంటర్  ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు స్కానింగ్ లు చేయలేదని పబ్లిక్  చెబుతున్నారు. అల్ట్రా సౌండ్  స్కానింగ్, సిటీ స్కానింగ్, టిఫా స్కానింగ్ లు చేస్తారు. దీంతో బయట సిటీ స్కానింగ్ కు రూ.5 వేలు, అల్ట్రా సౌండ్  స్కానింగ్ కు రూ.1000, టిఫా స్కానింగ్ కు రూ.1,500 నుంచి 2 వేల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. కేవలం ఎక్స్ రే, ఈసీజీ తీసి మిగతా టెస్టుల కోసం ప్రైవేట్  ల్యాబ్ లకు పంపిస్తున్నారు. 

సీబీపీ టెస్టులు కూడా చేస్తలేరు..

గద్వాల దవాఖానలో సీబీపీ టెస్ట్  కూడా చేయడం లేదు. ప్రతిరోజు 250 నుంచి 350 మంది పేషెంట్లకు సీబీపీ చేయాల్సి వస్తోంది. ఒకరికి సీబీపీ చేయాలంటే రూ.300 ఖర్చవుతుంది. ఆసుపత్రిలో పని చేసే వారికి ప్రైవేట్  ల్యాబ్ ఉండడంతో పేషెంట్లను అక్కడికే పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి రోజు 300 టెస్టులు చేస్తే రూ.90 వేల వరకు వస్తాయి.

ALSO READ :  అసంతృప్తులపై..స్పెషల్​ ఫోకస్

ఇందులో సగం డాక్టర్లకు కమీషన్​ ఇచ్చేలా  ప్రైవేట్ ల్యాబ్ కు చెందిన ఓ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకొని 15 రోజుల నుంచి ఈ దందాసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే పేషెంట్లకు ఎక్స్ రే తీసిన వెంటనే ఇవ్వడం లేదు. రెండు రోజులు ఆగి రమ్మని చెప్పడంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండడంతో పేషెంట్లు ప్రైవేట్​ హాస్పిటల్స్​కు వెళ్తున్నారు. 

మెషీన్లు చెడిపోయాయి

సీబీపీ టెస్ట్  చేసే మెషీన్  చెడిపోయిన మాట వాస్తవమే. కంపెనీ వాళ్లు రీ ప్లేస్  చేస్తామని చెప్పారు. రేడియాలజిస్ట్ లేకపోవడంతో స్కానింగ్ లు చేయడం లేదు. రేడియాలజిస్ట్  పోస్టుకు నోటిఫికేషన్  వేసినా ఎవరూ రావడం లేదు. 

-  డాక్టర్  ఇర్షాద్, టీ హబ్  కోఆర్డినేటర్