కరోనా లక్షణాలున్నా, లేకున్నా అందరికీ టెస్టులు చేయాలి

కరోనా లక్షణాలున్నా, లేకున్నా అందరికీ టెస్టులు చేయాలి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్‌‌‌‌ వ్యక్తుల కాంటాక్టుల్లో అసింప్టమాటిక్‌‌‌‌ ఉన్నవాళ్లకు టెస్టులు చేయకపోవడం సరికాదని అంటున్నారు. అసింప్టమాటిక్‌‌‌‌ పేషెంట్లు వైరస్ క్యారియర్లుగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ సడలింపుల తర్వాత ఇలాంటి వాళ్లతో వందల మందికి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో సారి (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్) పేషెంట్లకు, పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్స్‌‌‌‌లో సింప్టమ్స్ ఉన్న వాళ్లకు మాత్రమే కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌‌‌‌లో ఎసింప్టమాటిక్ ఉన్న వాళ్లకు పరీక్షలు చేయడం లేదు.

ఇదీ పరిస్థితి…

ఏప్రిల్ 22 నుంచి 25 వరకు వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌‌‌‌లో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి ట్రీట్‌‌‌‌మెంట్ ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో గాంధీకి వెళ్లాలని సూచించారు. కానీ ఆ వ్యక్తి అక్కడి నుంచి నిమ్స్‌‌‌‌కు, తర్వాత సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాడు. ఆ హాస్పిటల్‌‌‌‌ పంపిన శాంపిల్‌‌‌‌ను 26న నిమ్స్‌‌‌‌లో టెస్ట్ చేశారు. పాజిటివ్ వచ్చింది. తర్వాత ఆ వ్యక్తి కుటుంబీకులు, సన్నిహితుల్లో 9 మందికి వైరస్ అంటుకుంది. దీంతో వనస్థలిపురంలో పేషెంట్​కు ట్రీట్‌‌‌‌మెంట్ ఇచ్చిన దవాఖానను సీజ్ చేశారు. డాక్టర్లు, నర్సులు సహా 16 మందిని హోమ్‌‌‌‌ క్వారంటైన్ చేశారు. బాధితునితో డాక్టర్లు, నర్సులు నేరుగా కాంటాక్ట్‌‌ అయినా ఎవరికీ టెస్ట్ చేయించలేదు. ఏప్రిల్ 9న ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకారం డైరెక్ట్‌‌‌‌ అండ్ హైరిస్క్‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌కు టెస్టులు చేయించడం తప్పనిసరి.

శ్వాసకోశ ఇబ్బందులున్న పేషెంట్లకే..

ప్రైవేటు హాస్పిటళ్లకు వచ్చే కరోనా అనుమానితుల శాంపిళ్లను నిమ్స్‌‌‌‌కు పంపించాలని 20 రోజుల క్రితం ఆరోగ్య శాఖ ఉత్తర్వులిచ్చింది. వైరస్ లక్షణాలున్నా, కాంటాక్ట్, ట్రావెల్ హిస్టరీ లేదన్న కారణంతో చాలా శాంపిళ్లను టెస్టులు చేయడంలేదు. శ్వాసకోశ ఇబ్బందులున్న వాళ్ల శాంపిళ్లనే పంపాలని  రాష్ర్ట పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ కూడా జారీ చేశారు. దీంతో రోజుకు 150 వరకు వచ్చే శాంపిళ్లు, ఇప్పుడు 70 నుంచి 80కి తగ్గిపోయాయని సంబంధిత ల్యాబ్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు టెస్టుల వ్యవహారంపై కొంతమంది ప్రైవేటు డాక్టర్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. టెస్టులు తక్కువగా చేస్తున్నారని, కేసులు ఎక్కువున్న సూర్యాపేట, వికారాబాద్ సహా పలు జిల్లాల్లో పది రోజులుగా టెస్టులు చేయడం లేదని  సెంట్రల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు లెటర్ రాశారు.

ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తక్కువే

దేశంలోని 13 రాష్ర్టాల్లో 600 కంటే ఎక్కువ  కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ర్టాల్లో ఒక్క తెలంగాణలోనే తక్కువ టెస్టులు చేశారు. దేశంలోనే ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ర్టలో 1,59,754 టెస్టులు చేశారు. తమ రాష్ర్టంలో 57 శాతం కేసులు ఎసింప్టమాటిక్ అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 3,023 కేసులున్న తమిళనాడులో 1,50,107 పరీక్షలు చేశారు. మనకంటే తక్కువగా 614 కేసులున్న కర్ణాటకలో 74,898 శాంపిల్స్‌‌‌‌ టెస్ట్ చేశారు. మన రాష్ర్టంలో 20 వేల శాంపిళ్లనే టెస్టు చేయగా, వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌లో 22,915 మందికి చేశారు. ఈ రెండు రాష్ర్టాల్లో పాజిటివ్‌‌‌‌ రేట్‌‌‌‌ ఎక్కువగా, టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటమే సమస్యని ప్రముఖ అనలసిస్ట్, బ్రూకింగ్స్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ షమిక రవి ఆదివారం  ట్వీట్ చేశారు. అయితే బెంగాల్  ఇప్పుడు టెస్టుల సంఖ్యను పెంచింది.