సింప్టమ్స్ ఉంటెనే కరోనా టెస్ట్..లేకుంటే క్వారంటైన్

సింప్టమ్స్ ఉంటెనే కరోనా టెస్ట్..లేకుంటే క్వారంటైన్

హైదరాబాద్‌‌, వెలుగుకరోనా పాజిటివ్ వ్యక్తుల కుటుంబ సభ్యులకు కూడా వైరస్ లక్షణాలు లేకుంటే టెస్టులు చేయించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ చెప్పారు. కుటుంబ సభ్యుల్లో వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి మాత్రం లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయిస్తున్నామని, మిగతవాళ్లను హోం క్వారంటైన్ చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌‌లోనూ ఇదే విషయాన్ని వివరించామని మంత్రి వెల్లడించారు. కోఠిలోని కరోనా కమాండ్ సెంటర్‌‌‌‌లో శుక్రవారం సాయంత్రం మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చెప్పిందని, ఆ సంస్థ సూచనల ప్రకారమే టెస్టులు చేయిస్తున్నామన్నారు.

త్వరలో14 జిల్లాలు గ్రీన్ జోన్ లోకి..

రాష్ర్టంలో కరోనా కంట్రోల్‌‌లోనే ఉందన్నారు. ఆరెంజ్‌‌ జోన్‌‌లో ఉన్న మహబూబ్‌‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, కరీంనగర్‌‌‌‌, సిరిసిల్ల, మంచిర్యాల, నారాయణపేట,  నల్గొండ, జగిత్యాల, ఆసిఫాబాద్‌‌, జనగాం జిల్లాలను, రెడ్‌‌ జోన్‌‌లో ఉన్న వికారాబాద్‌‌ జిల్లాను గ్రీన్ జోన్‌‌లో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. సోమవారం నాటికి ఈ 14 జిల్లాలు గ్రీన్‌‌జోన్‌‌లోకి వస్తాయని తెలిపారు సూర్యాపేట, వరంగల్ అర్బన్‌‌, నిజామాబాద్‌‌ ఆరెంజ్‌‌ జోన్‌‌లో, హైదరాబాద్‌‌, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు రెడ్‌‌ జోన్‌‌లో కొనసాగుతాయని ఈటల చెప్పారు. ప్రస్తుతం గ్రీన్‌‌జోన్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్రం సూచనల ప్రకారం సడలింపులు ఇచ్చామని, ఒకవేళ ఎక్కడైనా వైరస్ వ్యాపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

8 సర్కిళ్లలోనే ఎక్కువ కేసులు

హైదరాబాద్‌‌లోని 8 సర్కిళ్లలోనే కేసులు ఎక్కువగా ఉన్నాయని మంత్రి తెలిపారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఏడెనిమిది కంటైన్‌‌మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఓల్డ్ సిటీలో కేసులు ఎక్కువగా వస్తున్నందున, అక్కడ మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసులు సంఖ్యను బట్టి కంటైన్‌‌మెంట్ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వలస కూలీలకు హోం క్వారంటైన్‌‌

ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో వైరస్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయిస్తామని ఈటల స్పష్టం చేశారు. లక్షణాలు లేనివారిని హోం క్వారంటైన్‌‌లో ఉంచుతామన్నారు. ఇంట్లో వసతులు లేనివారు హోటల్‌‌ క్వారంటైన్‌‌లో ఉండొచ్చన్నారు. హోటల్ ఖర్చులు భరించలేనివారిని, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతామన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయని మంత్రి వివరించారు.