రేపటి నుంచి టెట్ అప్లికేషన్లు

రేపటి నుంచి టెట్ అప్లికేషన్లు
  •      ఫీజు తగ్గించాలని పెరుగుతున్న విజ్ఞప్తులు 
  •     ఆన్‌‌‌‌లైన్​ఎగ్జామ్‌‌‌‌ నేపథ్యంలోనే పెంచామంటున్న ఆఫీసర్లు 

హైదరాబాద్,వెలుగు : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్-)–2024 అప్లికేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఫీజును ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పే చేసిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. గతేడాది ఫిజికల్‌‌‌‌గా టెట్‌‌‌‌ పరీక్ష నిర్వహించగా.. ఒక్క పేపర్ లేదా రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు ఉండేది. 

ఈసారి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో టెట్ నిర్వహిస్తుండటంతో ఒక్క పేపర్‌‌‌‌‌‌‌‌కు రూ.వెయ్యి చొప్పున రెండు పేపర్లకు రూ.2 వేల ఫీజు చెల్లించాలని విద్యా శాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే డీఎస్సీ పరీక్షకు రూ.వెయ్యి చెల్లిస్తున్నామని, మళ్లీ టెట్‌‌‌‌కు అంతే ఫీజు పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు లైబ్రరీల వద్ద నిరసనలు కూడా తెలిపారు. 

దీంతో టెట్ ఫీజులపై ప్రభుత్వపెద్దలు, విద్యా శాఖ అధికారులను ఆరా తీశారు. కానీ, ఆన్‌‌‌‌లైన్ పరీక్షల నేపథ్యంలోనే ఫీజు పెంచాల్సి వచ్చిందని వారు పేర్కొన్నట్టు తెలిసింది. గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌‌మెంట్​ బోర్డు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1,200 ఫీజు వసూలు చేశారని తెలిపినట్టు సమాచారం. కాగా, ఆన్‌‌‌‌లైన్ పరీక్షలు కావడంతోనే దరఖాస్తు ఫీజు పెంచామని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ట్రిబ్ కంటే రూ.200 తక్కువగానే తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికైతే ఫీజు తగ్గించాలనే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు. టెట్ ఫీజు తగ్గించిన తర్వాతే దరఖాస్తులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

అభ్యర్థులు సంప్రదించాల్సిన నంబర్లు.. 

  • టెట్ ఆఫీస్: 70757 01763/64 
  • హెల్ప్ డెస్క్ నంబర్లు: 70757 01768/84 
  • హెల్ప్ డెస్క్- టెక్నికల్ రిలెటెడ్: 70329 01383