
- పుస్తకాలు ఇయ్యకుండానే ప్రభుత్వ బడుల్లో పాఠాలు
- క్లాసులు మొదలై 3 వారాలు దాటినా పట్టించుకోని అధికారులు
- పుస్తకాలు రావడానికి ఇంకొన్ని వారాలు పట్టొచ్చు
- అప్పటిదాకా బ్రిడ్జి కోర్సులు నడపాలని విద్యాశాఖ ఆదేశం
- నెలాఖరుకు ఎఫ్‌ఏ–1 పరీక్షలు ఉండే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం బడులు తెరిచి మూడు వారాలు దాటింది. కానీ ఇంతవరకు విద్యార్థులకు అందించాల్సిన టెక్స్ట్ బుక్స్ మాత్రం ఇయ్యలేదు. సంబంధిత అధికారులను అడిగితే వారంలో వస్తాయి.. రెండు వారాలు పట్టొచ్చు అని సమాధానం ఇస్తున్నారని గవర్నమెంట్స్కూల్హెడ్మాస్టర్లు చెబుతున్నారు. అప్పటి వరకు బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం టీచర్లు అందరికీ బ్రిడ్జి కోర్సు సిలబస్‌నే చెప్తున్నారు. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ఉండే ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ–1) పరీక్షలు కూడా ప్రస్తుతం చెప్తున్న సిలబస్ ఆధారంగానే నిర్వహిస్తామని హెడ్మాస్టర్లు అంటున్నారు. ప్రభుత్వం అకడమిక్ఇయర్ను దృష్టిలో పుస్తకాలు ఎందుకు రెడీ చేయలేదని పలు విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు చదువులు ఆగమయ్యాయని, ఇలాంటి టైంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని విమర్శిస్తున్నారు. త్వరగా పుస్తకాలు అందించి చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని కోరుతున్నారు.
టి–శాట్‌లో డిజిటల్ పాఠాలు
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సూచనల ప్రకారం.. జులై ఒకటి నుంచి 15వ తేదీ వరకు టి–శాట్ ద్వారా డిజిటల్ పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ గత నెల 28న షెడ్యూల్ విడుదల చేసింది. బ్రిడ్జ్ కోర్సు డిజిటల్ పాఠాలు ఏ సమయానికి ఏ తరగతుల పాఠాలు ప్రసారం అవుతాయో అందులో పేర్కొంది. అలాగే వాటి యూట్యూబ్ లింక్‌లను అందించింది. వీటి ద్వారా టీచర్లు పిల్లలకు పాఠాలు చెబుతూ వర్క్ షీట్లు ఇస్తున్నారు. బ్రిడ్జ్ కోర్సు లెవల్–1లో రెండో తరగతి నుంచి ఐదో తరగతి సిలబస్‌ని, లెవల్–2లో ఆరు నుంచి ఏడో తరగతి సిలబస్ ని, లెవల్ –3 లో ఎనిమిది, తొమ్మిది క్లాసులు, లెవల్ –4లో పదో తరగతి సిలబస్‌ని పొందుపర్చారు. టీచర్లు వీటి ఆధారంగానే క్లాసులు చెబుతున్నారు. ప్రీ ప్రైమరీ పిల్లలకు బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నామని అంటున్నారు.
కిందటేడు ఇచ్చిన వాటితోనే..
కొవిడ్‌కారణంగా గతేడాది ప్రభుత్వ బడుల్లో చాలా క్లాసులకు సగం పుస్తకాలే పంపిణీ చేశారు. అప్పుడు మిగిలిన అరకొర పుస్తకాలు, విద్యార్థుల నుంచి పాత టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేసి వాటితో ప్రస్తుతం క్లాసులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల పది మంది విద్యార్థులను ఒక గ్రూప్ గా చేసి వారికి ఒక టెక్స్ట్‌బుక్ ఇచ్చి చదువుకోమని చెబుతున్నారు. బ్రిడ్జ్ కోర్సులోని ప్రశ్నలు, సమాధానాలను వాట్సాప్ ద్వారా పిల్లలకు పంపిస్తున్నారు. బడులు మొదలై 3 వారాలు దాటుతున్నా ఇంకా పుస్తకాలు పంపిణీ చేయకపోవడంతో టీచర్లలో తీవ్ర అంసతృప్తి కనిపిస్తుంది. బ్రిడ్జ్ కోర్సు సిలబస్ నుంచే ఎఫ్ ఏ–1 పరీక్షలు జరగనున్నాయి. అయితే వీటివల్ల పిల్లలు ఎంత వరకు నేర్చుకోగలుగుతారో అర్థం కావడంలేదని టీచర్లు వాపోతున్నారు.
బుక్స్, యూనిఫాం కోసం బంద్‌కు పిలుపు
షాద్ నగర్/శంషాబాద్, వెలుగు: సర్కారు బడుల్లోని స్టూడెంట్లు వెంటనే టెక్స్ట్ బుక్స్, యూనిఫాం అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చినట్లు శంషాబాద్ విభాగ్ ఎస్ఎఫ్‌డీ కన్వీనర్ పుట్నాల సాయికుమార్ తెలిపారు. సోమవారం శంషాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ప్రకటనలకే పరిమితమైందన్నారు. అకడమిక్ ఇయర్ మొదలై 3 వారాలు దాటుతున్నా పుస్తకాలు పంపిణీలో నిర్లక్ష్యం చేయడం దారుణం అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్స్కూళ్ల ఫీజు దోపిడీ నియంత్రించి, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌ను సక్సెస్చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వగుడ భానుప్రసాద్, సందీప్, జగదీశ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏబీబీపీ రాష్ట్ర సభ్యులు కోటి ప్రదీప్, చాకలి మహేశ్శంషాబాద్లో మీడియాతో మాట్లాడారు. మంగళవారం తలపెట్టిన బంద్‌ను సక్సెస్చేయాలని కోరారు.
వాట్సాప్ ద్వారా నోట్స్ పంపిస్తున్నం
అధికారుల ఆదేశాలతో ప్రస్తుతం బ్రిడ్జ్ కోర్సు నడుస్తోంది. మా దగ్గర ఉన్న పాత బుక్స్‌తో పిల్లలకు క్లాసులు చెప్తున్నాం. పిల్లలకు వాట్సాప్ ద్వారా నోట్స్ పంపిస్తున్నాం. స్టూడెంట్ల నుంచి పాత బుక్స్ తీసుకుని ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు చెప్తున్నాం. ఇంకో రెండు వారాల్లో బుక్స్ వస్తాయంటున్నారు. వాటి కోసం ఎదురు చూస్తున్నాం.
- శారద, హెచ్‌ఎం, గవర్నమెంట్ హైస్కూల్, మాసబ్ ట్యాంక్
ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు
గతేడాది టెక్స్ట్‌బుక్స్ సగమే ఇచ్చారు. ఇప్పుడు మొత్తానికే రాలేదు. అధికారుల ఆదేశాలతో బ్రిడ్జ్ కోర్సు స్టార్ట్ చేశాం. బేసిక్స్ నుంచి చెప్తున్నాం. ప్రీ, ప్రైమరీ పిల్లలకు రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, లెక్కలు నేర్పిస్తున్నాం. డిక్టేషన్ పెడుతున్నాం. మిగతా వారికి డిజి టల్ క్లాసులు నిర్వహిస్తున్నాం. గోడౌన్లకు బుక్స్ వచ్చా యంటున్నారు. మా వరకు ఎప్పుడొస్తాయో తెలియడం లేదు.
- రేణు, హెచ్‌ఎం, వెంకటరావు మెమోరియల్ హైస్కూల్, లాల్ దర్వాజ