తెలంగాణ ప్రభుత్వ స‌హ‌కారంతో నంది అవార్డ్స్

తెలంగాణ ప్రభుత్వ స‌హ‌కారంతో నంది అవార్డ్స్

సినీ పరిశ్రమలోని నటీనటులతోపాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్‌’ గుర్తింపునిస్తుంది. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’  ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం స‌హ‌కారంతో 2023 మే నెల‌లో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా వేడుక‌లు దుబాయ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను క‌లిశారు టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డాక్టర్‌.ఆర్‌కె గౌడ్. దూబాయ్‌లో నిర్వహిస్తున్న ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్‌’ కార్యక్రమం గురించి మంత్రి కి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి త‌ల‌సాని.. ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్‌’ కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహించ‌డం శుభ‌ప‌రిణామమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఎప్పడూ చిత్ర ప‌రిశ్రమ‌కు వెన్నుద‌న్నుగా ఉంటాయని చెప్పారు. రాబోయే కాలంలో మా పూర్తి స‌హ‌కారం ‘టీఎఫ్‌సీసీ’కి ఉంటుందన్నారు. 

అనంతరం మాట్లాడిన టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డాక్టర్‌. ఆర్‌.కె. గౌడ్.. టీఎఫ్‌సీసీ అవార్డ్స్ దుబాయ్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప‌లువురు సినీ మ‌రియు రాజ‌కీయ ప్రముఖుల‌ను ఆహ్వానించామన్నారు. రాజ్యస‌భ స‌భ్యులు, ర‌చ‌యిత‌, ద‌ర్శకులు విజ‌యేంద్ర ప్రసాద్ ను క‌లిసి.. మా ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి స‌హ‌క‌రించాల‌ని కోరామని తెలిపారు. వారు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ని క‌లిశామని చెప్పారు. ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్‌’  దుబాయ్‌లో నిర్వహిన్తున్నందుకు ముందుగా టీఎఫ్‌సీసీ స‌భ్యుల‌ను రామ్మోహ‌న్‌ అభినందించారని చెప్పారు. ఈ కార్యక్రమం విజ‌య‌వంతం కావ‌డానికి ఎలాంటి స‌హ‌కారం అందించ‌డానికైనా తాను ముందుంటాన‌ని హామీ ఇచ్చారని తెలిపారు. సీనియ‌ర్ న‌టులు శివాజీ రాజాను క‌లిసి ‘టీఎఫ్‌సీసీ అవార్డ్స్‌’ వేడుక గురించి వివ‌రించామని.. ఆయన కూడా సహకారం అందిస్తామన్నారని ఆర్‌.కె. గౌడ్ అన్నారు.