వానాకాలం సీజన్ కోసం..24 లక్షల టన్నుల ఫర్టిలైజర్స్

వానాకాలం సీజన్ కోసం..24 లక్షల టన్నుల ఫర్టిలైజర్స్

హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం సీజన్ కోసం 24.40 లక్షల టన్నుల ఫర్టిలైజర్స్ అవసరమని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో ఒక్క యూరియానే 10.40 లక్షల టన్నులు అవసరం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు వానాకాలం సీజన్ 2024 ఎరువుల ప్రణాళికను వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసింది.

 ఫర్టిలైజర్స్ ప్లాన్​ను కేంద్రం ఆమోదించిందని, దాని ప్రకారం ఎరువుల కేటాయింపు జరుగుతుందని తెలిపింది. డీఏపీ 2.40 లక్షల టన్నులు, ఎన్​పీకే 10 లక్షల టన్నులు, ఎంవోపీ 60వేల టన్నులు, ఎస్​ఎస్​పీ లక్ష టన్నులను రైతులకు అందుబాటులో ఉంచుతారు. గతేడాది బఫర్​గా పెట్టుకున్న ఎరువులు కూడా మార్క్​ఫెడ్ వద్ద రెడీగా ఉన్నాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా ఎన్ని ఎరువులు అవసరం అవుతాయో ఆ మేరకు ప్లాన్​కు రెడీ చేశారు. అత్యధికంగా మే, జూన్ నెలల్లో 4.60 లక్షల టన్నుల చొప్పున ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ రెండు నెలల్లో ఎరువుల అవసరం ఎక్కువ ఉండనుండగా, ఆ మేరకు 9.20 లక్షల టన్నులు కేటాయించారు. ఈ ఏడాది ఎరువుల కొరత ఉండదని, రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.